

కాలిఫోర్నియా: రాత్రి పూట ఆకాశంలో సూర్యకాంతిని ప్రసరింపజేసే సరికొత్త ప్రయోగానికి ఒక సంస్థ శ్రీకారం చుట్టింది. ఈ వినూత్న విధానాన్ని అమెరికాకు చెందిన స్టార్టప్ సంస్థ రూపొందించింది. అంతరిక్షంలో వేలాది భారీ అద్దాలను అమర్చి, రాత్రి సమయాల్లో సూర్యకాంతిని భూమిపైన కావాలసిన చోట ప్రసరింపజేయాలని ఈ సంస్థ భావిస్తోంది. ఇందులో భాగంగా కాలిఫోర్నియాలోని సియెర్రా నెవాడా ప్రాంతంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. సమీపంలోని పర్వతాల అడుగు భాగంలో పరీక్షలు జరిపారు. రాత్రి సమయంలో కనీసం వెన్నెల నుంచి మధ్యాహ్నపు తీవ్రమైన పగటి కాంతిని ప్రసరింపజేసారు. ఇలా చేయడం ద్వారా వారికి ఆదాయం వస్తుంది. ఈ రాత్రి వేళల్లో అకస్మాత్తుగా వెలుగులు రావడం చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు.
సహాయక చర్యల కోసం
రాత్రి సమయాల్లో వెలుతురు ఉండటం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని కంపెనీ చెబుతోంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అక్కడ కరెంటు ఉండదు. చీకటి పడిన తర్వాత రక్షణ చర్యలు చేపట్టే సహాయక బృందాలకు ఈ కాంతి ఎంతగానో ఉపయోగపడుతుంది. పంటలకు తగినంత వెలుతురు అందించడం, పాడైపోయిన వీధి దీపాలకు ప్రత్యామ్నాయంగా మార్చడం వంటి ప్రయోజనాలు ఉంటాయని వివరించారు. ఈ ప్రయోగం గురించి ఆ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ, "రక్షణ బృందాలు మాకు తొలి వినియోగదారులుగా ఉంటారు, కాబట్టి మా సాంకేతికతను ఉపయోగించే బృందాలతో కలిసి ఈ ప్రయోగాన్ని నిర్వహించాము" అని తెలిపారు.
సహజ జీవనానికి ముప్పు
అయితే, ఈ ప్రయోగంపై పర్యావరణ వేత్తలు ఖగోళ శాస్త్రవేత్తలు మాత్రం నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి, పగలు అనే సహజ సిద్ధమైన తేడాను దెబ్బతీస్తే జీవరాశుల మనుగడకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. పక్షులు, కీటకాలు, జంతువులు తమ సహజమైన జీవన విధానాన్ని కోల్పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆకాశంలో కృత్రిమ కాంతి పెరిగితే నక్షత్రాలను స్పష్టంగా చూసే అవకాశం కోల్పోతామని ఖగోళ శాస్త్రవేత్తలు వాపోతున్నారు. ఈ ఆలోచన చాలా ప్రమాదకరమని ఎర్త్ జస్టిస్ సంస్థకు చెందిన సీనియర్ న్యాయవాది జాన్ హాసెల్మాన్ పేర్కొంటూ, "ఇది ఒక తెలివితక్కువ ప్రాజెక్ట్. దీని వెనుక పరిష్కారం కాని ఎన్నో ప్రశ్నలు, తీవ్రమైన నష్టాలు ఉన్నాయి. భూమిపై ఉన్న ప్రతి జీవి పగలు, రాత్రి లయకు అనుగుణంగానే పరిణామం చెందింది. దీనితో ఆటలాడటం మంచిది కాదని చెప్పడానికి బోలెడంత డేటా ఉంది" అని అన్నారు.