

మేరీల్యాండ్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద హెలికాప్టర్ దిగుతుండగా తృటిలో ప్రమాదం తప్పింది. చేతిలో 9 వారాల పసికందు అలెక్ నీల్ వాన్స్‌ను పట్టుకుని కిందికి దిగుతుండగా ఆమె అడుగు జారి అదుపు తప్పారు. వెంటనే అప్రమత్తమై రెయిలింగ్‌ను గట్టిగా పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం బిడ్డను సురక్షితంగా పరిశీలించుకుని ముందుకు కదిలారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి.
వెంటనే స్పందించని వైనం
ఉషా వాన్స్ వెంటే ఆమె భర్త, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ 4 సంవత్సరాల కుమార్తె మిరాబెల్‌ను ఎత్తుకుని మెట్లు దిగారు. ముందు జరిగిన ఘటనను గమనించని ఆయన కుటుంబంతో కలిసి విమానం వైపు నడిచారు. అయితే, ఉషా వాన్స్ తూలిపడే సమయంలో పక్కనే ఉన్న సిబ్బంది, భద్రతా దళాలు ఎవరూ ఆమెకు సాయం చేసేందుకు ముందుకు రాకపోవడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రోటోకాల్ నిబంధనలు ఎలా ఉన్నా చేతిలో చంటిబిడ్డ ఉన్నప్పుడు మానవతా దృక్పథంతో స్పందించకపోవడం దారుణమంటూ పోస్టులు పెడుతున్నారు.
అలాస్కా పర్యటన వేళ
మధ్యంతర ఎన్నికల ప్రచారంలో భాగంగా జేడీ వాన్స్ అలాస్కా పర్యటనకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రిపబ్లికన్ సెనేటర్ డాన్ సల్లివన్ తరఫున నిర్వహించే ర్యాలీలో పాల్గొనేందుకు కుటుంబసమేతంగా బయల్దేరారు. జూలై 19న జన్మించిన తమ నాలుగో సంతానం అలెక్ వాన్స్‌తో పాటు ఈ ప్రయాణం సాగుతోంది. దాదాపు ఏడున్నర గంటల ప్రయాణం కావడంతో పసికందుతో వెళ్లడంపై వాన్స్ సరదా వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే, హెలికాప్టర్ మెట్ల వద్ద రక్షణ చర్యల లోపం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది.