

ప్రభాత ఉదయం : రోమన్ క్యాథలిక్ క్రైస్తవుల ఆధ్యాత్మిక గురువు పోప్ లియో-14కు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు వాటికన్ వెల్లడించింది. రోమ్‌లోని గెమెల్లి ఆసుపత్రిలో ఆయనకు నిర్వహించిన శస్త్రచికిత్సలో కుడి ఊపిరితిత్తి కింది భాగాన్ని వైద్యులు తొలగించారు. సుమారు 90 నిమిషాల పాటు సాగిన ఈ ఆపరేషన్ విజయవంతమైందని, ఎలాంటి సమస్యలు తలెత్తలేదని ప్రకటించారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారని తెలిపారు.
పరీక్షల్లో క్యాన్సర్ నిర్ధారణ
వైద్య పరీక్షల్లో పోప్ కుడి ఊపిరితిత్తిలో గుర్తించిన కణితి క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. దీనిని పల్మనరీ అడెనోకార్సినోమాగా గుర్తించినట్లు వాటికన్ వెల్లడించింది. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో సాధారణంగా కనిపించే ఒక రకమని డాక్టర్ స్టీఫెన్ తెలిపారు. శస్త్రచికిత్స సమయంలో తొలగించిన కణజాలాన్ని పరీక్షించగా ఈ నిర్ధారణకు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. క్యాన్సర్ ఏ మేరకు విస్తరించిందో తెలుసుకునేందుకు తదుపరి పరీక్షలు అవసరం. వాటి ఫలితాల ఆధారంగా మరింత చికిత్స అవసరమా లేదా అన్నది నిర్ణయించనున్నారు.
అక్టోబర్ 20 వరకు కార్యక్రమాలు రద్దు
శస్త్రచికిత్స నేపథ్యంలో అక్టోబర్ 20 వరకు పోప్ అధికారిక సమావేశాలు, బహిరంగ కార్యక్రమాలను వాటికన్ రద్దు చేసింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. శస్త్రచికిత్స అనంతర పరీక్షల్లో రక్త పరీక్షలు, ఛాతీ ఎక్స్‌రే ఫలితాలు సాధారణంగానే ఉన్నాయని, ఆయన నడవడం ప్రారంభించి సాధారణంగా ఆహారం తీసుకుంటున్నారని వాటికన్ తెలిపింది.
దక్షిణ అమెరికా పర్యటనపై ఉత్కంఠ
నవంబర్ 6 నుంచి 17 వరకు ఉరుగ్వే, అర్జెంటీనా, పెరూ దేశాల్లో పోప్ పర్యటించాల్సి ఉంది. అయితే శస్త్రచికిత్స అనంతరం ఆయన కోలుకునే తీరును బట్టి ఈ పర్యటనపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఆందోళన వ్యక్తం చేస్తూ, త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మే 2025లో పోప్‌గా లియో-14 ఎన్నికయ్యారు.