‘‘హూతీలు ఎవరు.. సౌదీపై దాడులు దేనికి’’

2014లో యెమెన్‌ రాజధాని సనాను స్వాధీనం చేసుకున్న హూతీలు, 2023 నుంచి ఎర్రసముద్రంలో నౌకలపై దాడులు చేస్తున్నారు. ఈ పరిణామాలు ప్రపంచ వాణిజ్యం, ఇంధన సరఫరాలపై ప్రభావం చూపుతున్నాయి.
Houthi Rebels
Published on: 

సనా/రియాద్: మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలకు కారణమవుతున్న హూతీ రెబల్స్‌.. అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారారు. అసలు వీరు ఎవరు? సౌదీ అరేబియాపై పదేపదే ఎందుకు దాడులు చేస్తున్నారు? ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులతో ప్రపంచ వాణిజ్యాన్ని, ఇంధన సరఫరాలను ఎలా ప్రభావితం చేస్తున్నారు? అనే అంశాలపై ఆసక్తి పెరుగుతోంది. యెమెన్‌కు చెందిన ఈ సాయుధ తిరుగుబాటు బృందం.. ఆ దేశ అంతర్యుద్ధంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, ప్రాంతీయ శక్తుల మధ్య ఘర్షణల్లోనూ ప్రధాన భాగస్వామిగా ఉంది. వీరి దాడులు ఎర్ర సముద్రం మీదుగా సాగే అంతర్జాతీయ నౌకాయానంపై ప్రభావం చూపుతూ, ప్రపంచ వాణిజ్యం, ఇంధన మార్కెట్లలో అనిశ్చితిని పెంచుతున్నాయి.

 హూతీల మూలాల వెనుక చరిత్ర

యెమెన్‌ వాయవ్య ప్రాంతంపై పట్టు సాధించిన శక్తిమంతమైన సైనిక, రాజకీయ, మతపరమైన ఉద్యమమే హూతీ రెబల్స్‌. 1990లలో ఉత్తర యెమెన్‌లో జైదీ షియా ఇస్లాం వర్గ పునరుజ్జీవన ఉద్యమంగా ఇది ఆవిర్భవించింది. అనంతరం యెమెన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు సాయుధ పోరాటాలు చేస్తూ తన బలాన్ని పెంచుకుంది. 2011లో అరబ్‌ స్ప్రింగ్‌ నిరసనలతో అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలేహ్‌ పాలన బలహీనపడిన నేపథ్యంలో హూతీల ప్రాబల్యం మరింత పెరిగింది. అబ్దుల్‌ మాలిక్‌ అల్‌-హూతీ నాయకత్వంలో ఈ ఉద్యమం బలమైన సాయుధ దళంగా రూపాంతరం చెందింది. 2014లో రాజధాని సనాను స్వాధీనం చేసుకుని, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యెమెన్‌ ప్రభుత్వాన్ని అక్కడి నుంచి వెళ్లగొట్టింది. అప్పటి నుంచి దేశంలోని రాజకీయ, సైనిక పరిణామాల్లో హూతీలు కీలక శక్తిగా కొనసాగుతున్నారు.

 సౌదీతో శత్రుత్వం.. ఎర్రసముద్రంలో వాణిజ్య దిగ్బంధం

యెమెన్‌లో ఇరాన్ ప్రభావం పెరుగుతుందనే భయంతో సౌదీ అరేబియా 2015 ప్రారంభంలో హూతీలపైకి సైనిక జోక్యానికి దిగింది. అయితే యెమెన్ పర్వత భూభాగాల కారణంగా ఇరువర్గాలు ఎలాంటి స్పష్టమైన విజయం సాధించలేకపోయాయి. ఐక్యరాజ్యసమితి చొరవతో 2022లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం కొంతకాలం శాంతిని నెలకొల్పింది. కానీ, ఇజ్రాయెల్-గాజా యుద్ధం నేపథ్యంలో పాలస్తీనాకు మద్దతుగా హూతీలు నవంబర్ 2023 నుంచి ఎర్రసముద్రంలో నౌకలపై దాడులు చేయడం ప్రారంభించారు. అమెరికా దళాలు తమ మిత్రదేశమైన ఇరాన్‌పై దాడులు చేయడంతో, హూతీలు తమ దాడులను మరింత తీవ్రతరం చేశారు. ఎర్రసముద్రం, బాబ్ ఎల్-మండబ్ జలసంధి గుండా వెళ్లే నౌకాదళ మార్గాలను దిగ్బంధించి ప్రపంచ వాణిజ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నారు.

 సౌదీ శక్తి సామర్థ్యాలు.. హూతీల బలమైన ఆయుధాగారం

సౌదీ అరేబియా ప్రపంచ చమురు మార్కెట్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచ చమురు ఉత్పత్తిలో దాదాపు 11 శాతం వాటాను కలిగి ఉంది. ప్రపంచంలో లభిస్తున్న చమురు నిల్వల్లో దాదాపు 15 నుంచి 17 శాతం సౌదీలోనే ఉన్నాయి. ఆ దేశ జీడీపీలో చమురు రంగం వాటా 50 శాతంగా ఉంది. ఇంతటి శక్తిమంతమైన దేశాన్ని ఇరాన్ సమకూర్చిన సరికొత్త క్షిపణులు, డ్రోన్లతో వణికిస్తున్నారు. సుమారు 1,80,000 నుంచి 2,00,000 మంది సాయుధ బలగాలు కలిగిన ఈ సంస్థ వద్ద పుష్కలంగా ట్యాంకులు, లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా హైపర్ సోనిక్ సామర్థ్యాలు కలిగిన పాలస్తీనా-2, టౌఫాన్ వంటి అత్యాధునిక క్షిపణులను ఉపయోగిస్తూ సౌదీ ఎయిర్ డిఫెన్స్‌ను  సవాలు చేస్తున్నారు. పదే పదే చమురు బావులు, ఎయిర్‌పోర్టులను టార్గెట్ చేస్తున్నారు. ఈ భద్రతా సంక్షోభం నేపథ్యంలో సౌదీ అరేబియా తన మిలిటరీ ఆపరేషన్లను మరింత ముమ్మరం చేసింది.