

న్యూఢిల్లీ: దేశరాజధానిలోని సెంట్రల్ పార్క్ వద్ద తలపెట్టిన ‘తిరంగా మార్చ్’లో పాల్గొనేందుకు వెళ్తున్న సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో ఆయన బస చేసిన ఇంటి నుంచి బయలుదేరుతుండగా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కాగా, తిరంగా మార్చ్ ను విరమించుకోవాలని పోలీసులు కోరగా, అభిజిత్ నిరాకరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సెంట్రల్ పార్క్ వద్ద ఇప్పటికే భారీ సంఖ్యలో పోలీస్ బలగాలను అందుబాటులో ఉంచారు. ఈ వారంలో అభిజీత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఇది రెండోసారి. ఇటీవలే ఆయన జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆందోళనలో పాల్గొనేందుకు ముంబై నుంచి విమానంలో బయల్దేరగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల అదుపులో నేహాబోరా
ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ) అధ్యక్షురాలు నేహా బోరాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెంట్రల్ పార్క్ వద్ద తిరంగా మార్చ్‌లో పాల్గొనేందుకు వెళ్తుండగా మండీ హౌస్ వద్ద ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. అంతకుముందు ఆమె మండీ హౌస్ నుంచి తిరంగా మార్చ్‌కు బయలుదేరుతున్నట్లు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.