

మేజర్ అయిన కూతురి విషయంలో
అలహాబాద్ హైకోర్టు తీర్పు
హెబియస్ కార్పస్ పిటిషన్ కొట్టివేత
ప్రయాగ్‌రాజ్: మేజర్ అయిన కుమార్తెను తల్లిదండ్రులతో కలిసి ఉండాలని ఆదేశించలేమని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ మేరకు దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కొట్టివేసింది. తన కూతురు పూజ(25) తనతో ఉండటం లేదంటూ అలహాబాద్‌కు చెందిన కళావతి హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు జోక్యం చేసుకొని తనతో ఉండేలా కూతురిని ఆదేశించాలని కోరారు. దీంతో ఆగస్టు 17న కళావతి కూతురిని విచారణకు ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇంట్లో తన తల్లి ప్రవర్తన బాగాలేదని, నిత్యం వేధిస్తుండటంతోనే ఢిల్లీలో ఉంటున్నట్లు పూజ విచారణ సందర్భంగా న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లింది. కళావతి మాత్రం కుమార్తె ఆరోపణలను తోసిపుచ్చుతూ కూతురిని తనతోనే ఉండేలా ఆదేశించాలని అభ్యర్థించింది. వాదనలు విన్న జస్టిస్ సందీప్ జైన్ గత నెల 28న తుది తీర్పు ఇచ్చారు. ఇష్టం లేకుండా మేజర్ అయిన కూతురిని తల్లిదండ్రులతో ఉండాలని ఆదేశించలేమని పేర్కొన్నారు. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ను కొట్టివేశారు.