

* 70 శాతం మేర తగ్గే చాన్స్
* మార్జిన్ 30 శాతానికి పరిమితం చేసిన కేంద్రం
* రోగులకు ఏడాదికి రూ.2,500 కోట్లు ఆదా
న్యూఢిల్లీ, అక్టోబర్ 9 : క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ధరల నియంత్రణ పరిధిలో లేని నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ ఔషధాలపై వ్యాపార మార్జిన్‌ను 30 శాతానికి పరిమితం చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయంతో క్యాన్సర్ మందుల ధరలు 70 శాతం వరకు తగ్గే అవకాశముందని, క్యాన్సర్ రోగులు, వారి కుటుంబాలకు ఏడాదికి సుమారు రూ.2,500 కోట్ల వరకు ఆదా అవుతుందని కేంద్రం తాజాగా పేర్కొన్నది. అధిక లాభాలకు అడ్డుకట్ట వేయడం, ధరల్లో అన్యాయమైన తేడాలను తగ్గించడం, క్యాన్సర్ రోగులకు మందులు అందుబాటులో ఉండేలా చూడటం ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశంగా కేంద్రం తెలిపింది. గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ మందుల ధరలపై నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) చేసిన పరిశీలనలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఈ మందులపై సగటున 170 శాతం వరకు ధర పెంచుతున్నట్లు గుర్తించింది. కొన్ని ఔషధాల విషయంలో ఈ పెంపు 700 శాతానికి పైగా ఉన్నట్లు పేర్కొన్నది. అంతేగాక ఒకే మందు ధర రిటైల్ మెడికల్ షాప్, ఆసుపత్రి ఫార్మసీ, ఆన్‌లైన్ ఫార్మసీల్లో వేర్వేరుగా ఉంటోందన్న విషయాన్ని తెలిపింది. కొత్త విధానం ప్రకారం ఈ మందుల గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ)పై సరఫరా, విక్రయ మార్జిన్‌ను 30 శాతానికి మించకుండా పరిమితం చేస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ఏయే ఔషధాలను ఈ విధానంలోకి తీసుకురావాలనే జాబితాను ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్’ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఖరారు చేయనుంది. ఆ తర్వాత ఎన్‌పీపీఏ దీనిపై అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తుంది. బ్రాండెడ్, జనరిక్ మందులు, దేశీయంగా తయారయ్యేవి, దిగుమతి చేసుకునేవి, పేటెంట్ ఉన్నవి, పేటెంట్ లేనివి, అన్ని రకాల నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ మందులకు ఈ చర్య వర్తించే అవకాశం ఉంది.