‘ఎస్​ఐఆర్’ ఉత్తర్వుల​పై సీజేఐ కీలక వ్యాఖ్య

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై వచ్చిన అన్ని అభ్యంతరాలను విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈసీకి సంబంధించిన పిటిషన్లపై తదుపరి విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది.
Supreme Court on ECI
సుప్రీంకోర్టు
Published on: 

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) పనితీరు, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్​ఐఆర్​) ప్రక్రియ ఉత్తర్వులపై వివాదానికి దారితీసిన అన్ని అంశాలపైనా విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. “మీరు బాధపడొద్దు. మాకన్నీ తెలుసు. అన్ని అంశాలపైనా విచారణ చేస్తాం” అని ఈసీకి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేసిన వారిని ఉద్దేశించి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్​ సూర్యకాంత్​ పేర్కొన్నారు. 2025 జూన్​, అక్టోబర్​తో పాటు 2026 మేలో ఎస్​ఐఆర్​ నిర్వహణకు సీఈసీ జ్ఞానేశ్​ ఉత్తర్వులను ఏకపక్షంగా ఇచ్చారని రాహుల్​ గాంధీ తరఫు న్యాయవాది ఏఎం సింఘ్వి ఆరోపించారు. ఈ వ్యవధిలో ఈసీ కార్యాలయంలో రూపొందించిన ఫైల్ నోటింగ్స్​తో పాటు అంతర్గత కమ్యూనికేషన్​ వివరాలను తనిఖీ చేస్తే జ్ఞానేశ్​ నిర్ణయాలు ఏకపక్షమా, ఏకగ్రీవమా అనేది తెలిసిపోతుందన్నారు. ఆయా ఫైళ్లను భద్రపర్చాలని ఈసీకి ఆదేశాలివ్వాలని ఆయన కోరారు. ఎస్​​ఐఆర్​ ఉత్తర్వుల జారీకి మిగతా ఇద్దరు కేంద్ర ఎన్నికల కమిషనర్ల సమ్మతిని జ్ఞానేశ్ తీసుకున్నారా లేదా అనేది తేలాలన్నారు. ఈ వాదనలపై స్పందించిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం పై కామెంట్స్​ చేయడం గమనార్హం.

250 పేజీల కౌంటర్​ అఫిడవిట్​

ఈసీ పనితీరు సరిగ్గా లేదని ఆరోపిస్తూ విపక్ష ఇండియా కూటమి నేతలు ఉమ్మడిగా పిటిషన్ వేశారు. ఇక రాకేశ్​ కుమార్​ సింగ్​ సహా మరో నలుగురు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటికి స్పందనగా సోమవారం రోజే ఈసీ దాదాపు 250 పేజీల కౌంటర్​ అఫిడవిట్​ను దాఖలు చేసింది. తాజాగా మంగళవారం ఈ వ్యవహారంపై సీజేఐ జస్టిస్​ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్​ జాయ్​మాల్యా బాగ్చి, జస్టిస్​ వి.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వాదనలు విన్నది.

ఫామ్​–6లో మార్పులను ఈసీ ఒప్పుకుంది: మేనక

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ డోలా సేన్ తరఫున మేనకా గురుస్వామి మంగళవారం వాదన వినిపించారు.  కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫామ్-6లో చట్టవిరుద్ధంగా అదనపు నిబంధనలను, డిక్లరేషన్లను ఎన్నికల సంఘం డిజిటల్‌గా జోడించిందని ఆమె ఆరోపించారు. ఫామ్-6లో తాము చేసిన మార్పులను సుప్రీంకోర్టు సమర్థించిందంటూ ఎన్నికల సంఘం ఒక ప్రెస్ నోట్​ను విడుదల చేసిందని, ఇది కోర్టును, ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ద్వారా ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫామ్-6ను మార్చిన విషయాన్ని పరోక్షంగా అంగీకరించిందని, దీనివల్ల పిటిషనర్లు చేస్తున్న ఆరోపణలు నిజమేనని రుజువైందని మేనక పేర్కొన్నారు.

ఈ ఆరోపణలను ఈసీ తరఫు లాయర్ మణిందర్ సింగ్ తోసిపుచ్చారు. మేనక కోర్టులో మాటల గారడీ చేస్తున్నారని విమర్శించారు. ఫామ్-6ను ఈసీ అధికారికంగా సవరించలేదని స్పష్టం చేశారు. దీనిపై సుప్రీంకోర్టు బెంచ్​ స్పందిస్తూ, ‘‘ఈ కొత్త ఆరోపణలపై ఎన్నికల సంఘం మరింత స్పష్టతతో కూడిన పూర్తి సమాధానాన్ని ఇవ్వాలనుకుంటే, మరో అదనపు అఫిడవిట్​ను కూడా సమర్పించొచ్చు” అని తెలిపింది. ‘‘కోర్టును రాజకీయ వేదికగా మార్చుకునే అవకాశాన్ని ఎవ్వరికీ ఇవ్వొద్దు” అని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరారు.

విచారణ నవంబరు 17కు వాయిదా

ఈసీ అఫిడవిట్​పై స్పందన తెలుపుతూ రీజాయిండర్​ను దాఖలు చేసేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని ప్రధాన పిటిషనర్​ రాకేశ్​ కుమార్ సింగ్​ తరఫు న్యాయవాది వికాస్​ సింగ్​ కోర్టును కోరారు. దీంతో ఇందుకోసం పిటిషనర్లకు మరో పది రోజుల గడువును ధర్మాసనం మంజూరుచేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను నవంబరు 17కు వాయిదా వేసింది.