భారత వాయుసేనకు సొంత ఉపగ్రహం

ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం జీశాట్-7సీ ఉపగ్రహాన్ని స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేయనున్నారు.
IAF Gets GSAT-7C Communication Satellite
IAF to get first dedicated communications satellite GSAT-7C
Published on: 

న్యూఢిల్లీ: భారత రక్షణ రంగంలో సరికొత్త మైలురాయి నమోదైంది. వాయుసేన కోసం ప్రత్యేకంగా అత్యాధునిక ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ రూ.2,563 కోట్ల భారీ కాంట్రాక్ట్‌పై సంతకం చేసింది. జీశాట్-7సీ పేరుతో రూపొందనున్న ఈ సరికొత్త శాటిలైట్ ద్వారా విమానాల మధ్య సమాచార మార్పిడి వేగవంతం కానుంది. ఇప్పటివరకు ఇతర దళాలతో కలిసి ట్రాన్స్‌పాండర్ సామర్థ్యాన్ని పంచుకుంటున్న వాయుసేనకు ఇకపై స్వంత ఉపగ్రహం అందుబాటులోకి రానుంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌తో ఈ ఒప్పందం కుదిరింది.

 దేశీయ సాంకేతికతకు పెద్దపీట

ఈ ప్రాజెక్టును పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్ చేసి అభివృద్ధి చేయనున్నారు. 'ఆత్మనిర్భర్ భారత్', 'మేక్ ఇన్ ఇండియా' నినాదాలకు అనుగుణంగా దేశీయ రక్షణ తయారీ సామర్థ్యాలను పెంచే దిశగా ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ అదనపు కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ (అక్విజిషన్) ఎ. అంబరసు సమక్షంలో ఒప్పందం ఖరారయింది.

 అద్భుతమైన ఫీచర్లు

ఇప్పటివరకు నౌకాదళం, ఆర్మీతో కలిసి ఉపగ్రహ సేవలను వాయుసేన వాడుకుంటోంది. 2021లో రక్షణ శాఖ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ దీనికి ఆమోదం తెలిపింది. ఈ ఉపగ్రహం అందుబాటులోకి వస్తే గ్రౌండ్ స్టేషన్లు, గాల్లో ఉన్న యుద్ధ విమానాల మధ్య సమాచారం, వీడియోల ప్రసారం నిరంతరం సురక్షితంగా సాగుతుంది. వార్ రూముల్లోని కమాండర్లు నేరుగా ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేందుకు వీలవుతుంది. అత్యున్నత స్థాయి ఎన్‌క్రిప్షన్ విధానాలతో శత్రువులు హ్యాక్ చేయలేని విధంగా కమ్యూనికేషన్ నోడ్స్ పనిచేస్తాయని అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో యుద్ధ తంత్రాలను వేగంగా మార్చేందుకు ఈ సాంకేతికత ఎంతో శ్రేష్ఠం అని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.