

న్యూదిల్లీ : ఢిల్లీలో చలి మొదలవుతుండగా.. మరోవైపు వాయు కాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఉదయం ఉష్ణోగ్రత ఈ సీజన్‌లోనే అత్యల్పంగా 16.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఉదయం 10 గంటలకు గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 178కు చేరినట్లు సీపీసీబీ, ఐఎండీ వెల్లడించాయి. అక్టోబరు 21, 22, 23 తేదీల్లో గాలి నాణ్యత గణనీయంగా పడిపోయింది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఏక్యూఐ 153గా నమోదైంది. నగరంలోని 22 ప్రాంతాల్లో గాలి నాణ్యత ‘పూర్’ స్థాయిలో ఉండగా.. మరో 34 ప్రాంతాల్లో ‘మధ్యస్థం’గా నమోదైంది. అక్టోబరు 26 నుంచి 28 వరకు గాలి నాణ్యత ‘పూర్’ స్థాయిలోనే ఉండొచ్చని సీపీసీబీ అంచనా వేసింది.
పదేళ్ల నాటి సర్వేల ఆధారంగానే అంచనాలు!
దేశ రాజధానిలో వాయు కాలుష్యం పెరుగుతున్నా.. దాని మూలాలను గుర్తించడంలో శాస్త్రవేత్తలకు పూర్తి స్పష్టత లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ కాలుష్యంపై ఐఐటీ కాన్పూర్ 2013–14లో ఆరు ప్రాంతాల్లో గాలి నమూనాలను సేకరించి అధ్యయనం చేసింది. ఆ తర్వాత 2016లో నిర్వహించిన సర్వేల ఆధారంగానూ కాలుష్య మూలాలను అంచనా వేస్తున్నారు. గాలిలోని పీఎం2.5 సూక్ష్మ కణాలు వాహనాల పొగ, పంట వ్యర్థాలు, కట్టెల దహనం, రోడ్లు, నిర్మాణ ప్రాంతాల ధూళి వల్ల నేరుగా వెలువడతాయి. వాహనాలు, విద్యుత్తు కేంద్రాల నుంచి వచ్చే నైట్రోజన్ ఆక్సైడ్లు, పరిశ్రమల నుంచి వెలువడే సల్ఫర్ డయాక్సైడ్, వ్యవసాయ కార్యకలాపాల నుంచి వచ్చే అమ్మోనియా వంటి వాయువులు రసాయన చర్యల ద్వారా కూడా సూక్ష్మ కణాలుగా మారతాయి. ఢిల్లీ నగరంలోని ఉద్గారాలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే కాలుష్య కారకాలు కూడా గాలి నాణ్యత దిగజారడానికి కారణమవుతున్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.