

న్యూఢిల్లీ: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ దేశరాజధానిలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ శనివారం పిలుపునిచ్చిన భారీ ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ సర్కార్ అలర్ట్ అయ్యింది. ఎక్కడికక్కడ కేంద్ర, రాష్ర్ట బలగాలను రంగంలోకి దించారు. నిరసనకారులు జంతర్ మంతర్‌కు చేరుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు, కంచెలు అడ్డుగా పెట్టారు. ఇక ఢిల్లీకి చేరుకొనే అన్ని మార్గాలపై నిఘా పెట్టడంతో పాటు నిరసనకారులతో వస్తున్న వాహనాలను లోపలికి అనుమతించడం లేదు. అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకొని వివిధ స్టేషన్లకకు తరలిస్తున్నారు. ఆగ్నేయ ఢిల్లీలోని ఇండస్ర్టియల్ హబ్ ఏరియా మోహన్ ఎస్టేట్ వద్ద భారీ ముళ్ల పట్టిని రోడ్డుపై అడ్డుగా పెట్టారు. యూపీలోని ఘాజీపూర్ సరిహద్దు గుండా ఢిల్లీకి చేరుకోకుండా ప్రధాన రహదారికి అడ్డంగా పెద్ద రాయిని ఏర్పాటు చేశారు. ముఖ్యమైన ప్రాంతాలకు అనుమతి లేకుండా ఎవరిని వెళ్లనివ్వడం లేదు. సుమారు 500మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
భారీ బలగాలు.. పలు రైళ్ల రద్దు
సీజేపీ నిరసన నేపథ్యంలో సుమారు 20వేలకుపైగా పోలీస్, కేంద్ర బలగాలను కేంద్రం రంగంలోకి దించింది. దీంతో పాటు జంతర్ మంతర్ కు నిరసనకారులు చేరుకోకుండా సుమారు 45 మెట్రో స్టేషన్లను మూసివేశారు. వివిధ రాష్ర్టాల నుంచి శనివారం ఢిల్లీతో పాటు హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లకు చేరుకునే దాదాపు 250 రైళ్లను కేంద్రం రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఢిల్లీకి చేరుకునే 12 సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు సౌత్ డిస్ర్టిక్ట్ డీసీపీ అనంత్ మిట్టల్ తెలిపారు.