‘ప్రళయ్’ గర్జన.. లక్ష్య ఛేదనలో సక్సెస్‌!

స్వదేశీ ప్రళయ్ క్షిపణి ప్రయోగ పరీక్షను డీఆర్‌డీఓ విజయవంతంగా నిర్వహించింది. త్వరలో ఈ క్షిపణి వ్యవస్థను భారత సైన్యంలో చేర్చనున్నారు.
India's indigenous Pralay surface-to-surface quasi-ballistic missile
స్వదేశీ ప్రళయ్ క్షిపణి
Published on: 

చండీపూర్‌ : స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన ‘ప్రళయ్’ క్షిపణి ప్రయోగ పరీక్షను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ) విజయవంతంగా నిర్వహించింది. ఒడిశాలోని భద్రక్ జిల్లా పరిధిలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్​లో ఈ ప్రయోగం జరిగింది. భారత సైన్యానికి ప్రళయ్​ను అందించనున్న నేపథ్యంలో, దాని పనితీరుపై తుది అంచనాకు వచ్చేందుకు ఈ పరీక్షను చేపట్టారు. దీంతో దేశ రక్షణ రంగానికి మరింత బలం చేకూరిందని రక్షణ శాఖ తెలిపింది. ఈ ప్రయోగ పరీక్షలో ప్రళయ్​ అన్ని లక్ష్యాలను విజయవంతంగా ఛేదించిందని వెల్లడించింది. చండీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్​కు చెందిన వివిధ నిఘా పరికరాలు క్షిపణి పనితీరును రికార్డ్ చేసి, పరీక్ష విజయవంతమైందని ధ్రువీకరించాయని పేర్కొంది. ఇక ఈ క్షిపణి వ్యవస్థను భారత సైన్యంలో చేర్చడం తథ్యమని రక్షణశాఖ ప్రకటించింది. ఈసందర్భంగా డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు, సాయుధ దళాలు, పారిశ్రామిక భాగస్వాములకు అభినందనలు తెలుపుతూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్​ చేశారు. ఈ క్షిపణి భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా భారత సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని ఆయన చెప్పారు. ఈ విజయాన్ని దేశ రక్షణ రంగానికి కీలక మైలురాయిగా అభివర్ణించారు. కాగా, ప్రళయ్ క్షిపణిని హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్​సీఐ) సంస్థ, ఇతర డీఆర్‌డీఓ ల్యాబ్‌ల సహకారంతో అభివృద్ధి చేసింది. దీని తయారీ, భాగస్వామ్య బాధ్యతలను భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్​) నిర్వర్తించింది.

ప్రళయ్ ప్రత్యేకతలు

  • ఇది ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే స్వల్పశ్రేణి క్వాసీ బాలిస్టిక్ క్షిపణి.

  • మందుగుండు సామగ్రిని మోసుకెళ్లగలదు.

  • లక్ష్య ఛేదన పరిధి 150 కి.మీ నుంచి 500 కి.మీ

  • అధునాతన నావిగేషన్ వ్యవస్థలు  

  • వేర్వేరు శత్రు లక్ష్యాలను ధ్వంసం చేయడానికి, విభిన్న వార్‌హెడ్‌లను తీసుకెళ్లగలదు.

  • 1,000 కిలోల బరువున్న పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు.