

తిరువనంతపురం: కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుతైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్), విజయన్ కుమార్తె వీణకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మధ్య ఆర్థిక లావాదేవీల కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అక్టోబర్ 23న కొచ్చిలోని ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని అధికారులు అందులో పేర్కొన్నారు. ఈ కేసులో పినరయికి ఈడీ సమన్లు జారీ చేయడం ఇదే తొలిసారి. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ఈ వ్యవహారాన్ని విచారిస్తోంది.
వీణకు నెలవారీ చెల్లింపుల ఆరోపణలు
విజయన్ కుమార్తె వీణకు చెందిన ఎక్సాలాజిక్ సంస్థకు సీఎంఆర్ఎల్ నుంచి నెలవారీగా నగదు చెల్లింపులు జరిగినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. సంబంధిత సేవలు అందించకపోయినా, ఐటీ కన్సల్టెన్సీ సేవల పేరుతో ఈ చెల్లింపులు చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో సుమారు రూ.2.78 కోట్ల చెల్లింపులు జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. వీణకు నెలకు రూ.5 లక్షల చొప్పున కన్సల్టెన్సీ ఫీజు చెల్లించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ ఆరోపణలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
విజయన్, వీణ, రియాజ్‌పై ఎఫ్‌ఐఆర్‌లు
ఈ కేసులో కేరళ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో(వీఏసీబీ) రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. ఈ నెల 9న కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. మొదటి ఎఫ్‌ఐఆర్‌లో పినరయిని మొదటి నిందితుడిగా పేర్కొనగా, మరో ఎఫ్‌ఐఆర్‌లో ఆయన అల్లుడు, మాజీ మంత్రి పీఏ మహమ్మద్ రియాజ్‌ను మొదటి నిందితుడిగా పేర్కొన్నారు. వీణను రెండు కేసుల్లోనూ నిందితురాలిగా చేర్చారు.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం
ఈ కేసులో నిందితులపై ఎఫ్ఆర్ఐ నమోదు చేయాలని కేరళ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ పినరయి విజయన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు అరెస్ట్ ముప్పు ఉందని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌పై దసరా సెలవుల అనంతరం విచారణ జరగవచ్చని న్యాయస్థానం సంకేతాలు ఇచ్చింది. అవసరమైతే సెలవుల సమయంలోనే ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా ప్రధాన న్యాయమూర్తి ప్రస్తావించారు.