

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ‘సర్’ ప్రక్రియ ముగిసిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల అధికారులకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల ముసాయిదా జాబితా నుంచి తొలగించిన అర్హులతో పాటు కొత్తగా నమోదు చేసుకున్నవారి వివరాలను పొందుపరచడానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సూచించింది. పశ్చిమ బెంగాల్, బిహార్ సహా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ ప్రక్రియ ముగిసింది. ఆయా చోట్ల ఓటర్ల ముసాయిదా జాబితా నుంచి 13 కోట్ల మంది పేర్లను ఎన్నికల సంఘం తొలగించింది. ఇందులో అర్హులను గుర్తించడంతోపాటు కొత్తగా పేర్లను నమోదు చేసుకున్నవారి వివరాలను పొందుపరిచేందుకు ప్రత్యేక డ్రైవ్ తక్షణమే చేపట్టాలని గత నెల 26న ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా బీఎల్వోలు ఇంటింటికీ తిరుగుతూ సర్ ప్రక్రియలో భాగంగా తొలగించిన ఓటర్ల వివరాలను ఫారం6 ద్వారా నమోదు చేయాలని, వారి స్థితిగతులను అందులో పొందుపరచాలని పేర్కొంది. ప్రతి బీఎల్వో వారానికి 20 నుంచి 25 మంది ఓటర్ల వివరాలు నమోదు చేస్తూ నెలలో ఈ ప్రక్రియను ముగించాలని ఆదేశించింది. అయితే, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ జిల్లా ఎన్నికల అధికారులు, ఆర్వోల సారథ్యంలో నిరంతరం కొనసాగుతుందని బెంగాల్ ముఖ్య ఎన్నికల అధికారి ఎక్సలో పోస్ట్ చేశారు.