

న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్, ‘‘డియర్ ప్రైమ్ మినిష్టర్ అంబానీ’’ అంటూ తన సొంత సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు దేశవ్యాప్తంగా రాజకీయంగానూ, వ్యాపార వర్గాల్లోనూ తీవ్ర కలకలం రేపాయి. భారతదేశం రియల్ బాస్ అంబానీయేనా అంటూ ప్రశ్నించి ప్రస్తుతం దేశంలో రిలయన్స్ ఆధిపత్యాన్ని ప్రశ్నించారు ఎలాన్ మస్క్. భారత్‌లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు, స్పెక్ట్రమ్ కేటాయింపుల అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్‌కు వ్యతిరేకంగా వ్యాపార గుత్తాధిపత్యాలపై స్పందిస్తూ రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని టార్గెట్ చేయడం, అదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ట్వీట్ల ద్వారా సఖ్యత కనబరచడం విశేషంగా మారింది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో ప్రచురితమైన కథనాలను షేర్ చేస్తూ బీజేపీపై మస్క్ చేసిన విమర్శలు పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
స్టార్‌లింక్ బ్లాకింగ్.. మస్క్ తీవ్ర ఆరోపణలు
భారత్‌లో తన స్టార్‌లింక్ సేవలను కొందరు అంబానీ వంటి కుబేరులు (ఓలిగార్చ్లు) అడ్డుకుంటున్నారని ఎలాన్ మస్క్ బుధవారం ఎక్స్ వేదికగా ఆరోపించారు. భారత ప్రజలపై గుత్తాధిపత్యం చెలాయించేందుకే తమకు లైసెన్సులు రాకుండా కుట్ర పన్నుతున్నారని, ఇది దేశ ప్రజలకు చేస్తున్న నేరమని ఆయన మండిపడ్డారు. తాము భారత ప్రభుత్వపు ప్రతి చట్టానికి, నిబంధనకు కట్టుబడి ఉన్నామని, విపత్తుల సమయంలో ప్రాణాలు కాపాడేందుకు ఈ సాంకేతికత ఎంతో అవసరమని పేర్కొన్నారు. తాను అన్ని నిబంధనలు పాటించినా లైసెన్స్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తూ, 'అంబానీయే అసలైన ప్రధానినా' అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఎన్నికల బాండ్లు, విరాళాల ప్రస్తావన
అంతటితో ఆగకుండా ప్రభుత్వంపై కొన్ని ఘాటైన ఆరోపణలు కూడా చేసారు. రిలయన్స్ అనుబంధ సంస్థల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించిన పాత కథనాలను ఎలాన్ మస్క్ తన పోస్టులో ప్రస్తావించారు. రిలయన్స్ అనుబంధంగా ఉన్న ‘క్విక్ సప్లయ్’ సంస్థ ఎన్నికల బాండ్ల ద్వారా భాజపాకు రూ.385 కోట్లు, శివసేనకు రూ.25 కోట్లు విరాళంగా ఇచ్చిందని 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్', 'అల్ జజీరా' కథనాలను కోట్ చేసారు. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని ఉద్దేశించి మస్క్ నేరుగా విమర్శలు చేయడం మాత్రం ఇదే మొదటిసారి. ఆయనను 'భారత ప్రధాన మంత్రి అంబానీ గారూ..' అంటూ ఆయన చేసిన వ్యంగ్య సంబోధన సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. దీనిపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై రాజకీయంగానూ విపక్షాలు అధికార పార్టీని నిలదీసే అవకాశం ఉంది.
రాహుల్ గాంధీతో సఖ్యత.. పెరుగుతున్న రాజకీయ వేడి
మరోవైపు ఎలాన్ మస్క్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సఖ్యత కనబరచడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. దేశంలో కార్పొరేట్ గుత్తాధిపత్యాలు, సంపద కేంద్రీకరణలతో పాటు అనేక ఇతర సమస్యలపై రాహుల్ గాంధీ నిత్యం లేవనెత్తుతున్న వాదనలకు మస్క్ పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లుగా ఆయన సోషల్ మీడియా పోస్టులు సంకేతాలు ఇచ్చాయి. భారత్‌లో విదేశీ టెక్ కంపెనీలకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దక్కడంలేదనే భావనను మస్క్ తరచూ తన ట్వీట్ల ద్వారా ప్రస్తావిస్తున్నారు. కార్పొరేట్ అనుకూల విధానాలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గళంతో మస్క్ గొంతు కలపడం దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. భారత్‌పై ఆరోపణల సమయంలో రాహుల్‌ను ఆత్మీయంగా పలకరిస్తూ చేసిన ట్వీట్‌కు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ కూడా అంతే స్థాయిలో ఆత్మీయతను కనబరిచారు. మస్క్‌కు వెల్ కం చెబుతూ దేశంలో మరొకరు వచ్చేదాకా ఆగక తప్పదని స్పష్టం చేశారు.
గుత్తాధిపత్య ఆరోపణలను తోసిపుచ్చిన సర్కారు
మస్క్ విమర్శలపై రిలయన్స్ నుంచి ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. అయితే, దేశంలో గుత్తాధిపత్యంపై వస్తున్న వ్యాఖ్యలను భారత ప్రభుత్వం ఖండించింది. ఏ రంగంలోనైనా భారత్ ఎప్పుడూ గుత్తాధిపత్యాన్ని అనుమతించబోదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. అన్ని శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీలకు ఒకే రకమైన నియంత్రణ, భద్రతా నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేసింది. విదేశీ సంస్థల నుంచి వస్తున్న ఈ ఆరోపణలు అర్థరహితమని అధికారులు తోసిపుచ్చారు.
లైసెన్సులు.. భద్రతా తనిఖీలు
భారత్‌లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించడానికి ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్‌తో పాటు రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, భారతీ ఎయిర్టెల్ మద్దతున్న వన్‌వెబ్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమిక లైసెన్సులు జారీ చేసింది. అయితే, వాణిజ్యపరంగా సేవలు ప్రారంభించడానికి, స్పెక్ట్రమ్ కేటాయింపులు జరగడానికి ముందు ఇవి అత్యంత కఠినమైన భద్రతాపరమైన తనిఖీలను ఎదుర్కొంటున్నాయి. భద్రతా ప్రమాణాలను తూచా తప్పకుండా పాటించిన తర్వాతే తుది అనుమతులు లభించనున్నాయి. ఇటీవల జమ్ముకశ్మీర్ అటవీ ప్రాంతాలలో ఎలాన్ మస్క్ కంపెనీ అయిన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నట్టుగా తేలడంతో ఆయన కంపెనీ లైసెన్స్‌కు బ్రేక్ పడింది. దీంతో ఆ ఉక్రోశం భరించలేక ఈ తరహా వైఖరిని ఫాలో చేస్తున్నట్టుగా విశ్లేషకులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో శాట్‌కామ్ రంగంలో పోటీ మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో లైసెన్సులు, స్పెక్ట్రమ్ కేటాయింపుల ప్రక్రియపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.