

జెరూసలేం: దుబాయ్ నగరం నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ప్రయాణికులను నిలువునా ముంచేసేందుకు ఓ సహ పైలట్ వేసిన భయంకరమైన కుట్ర త్రుటిలో తప్పింది. విమానాన్ని కూల్చేసి అమెరికాపై జరిగిన సెప్టెంబర్ 11 తరహా విధ్వంసం సృష్టించాలన్న ఒమన్ దేశస్థుడైన సహ పైలట్ హమామ్ అల్-హమ్మామి (29) పన్నాగం భారత పైలట్ సాహసంతో వీగిపోయింది. ఇజ్రాయెల్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. ప్రధాన పైలట్ స్మిత్ మచ్చార్‌పై కాక్‌పిట్ లోపల అత్యవసర సమయాల్లో వాడే గొడ్డలితో దాడి చేసి హత్య చేయాలని హమ్మామి భావించాడు. ఆ తర్వాత విమానాన్ని సాధారణ స్థితిలోనే టెల్ అవీవ్ దిశగా నడుపుతూ, ల్యాండింగ్ అనుమతులు పొందాలని ప్లాన్ చేశాడు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా బెన్ గురియన్ విమానాశ్రయంలోని ప్రయాణికుల టెర్మినల్ లేదా పక్కనే పార్క్ చేసి ఉంచిన ఇతర ప్రయాణిక విమానాలపైకి దీనిని వేగంగా పోనిచ్చి భారీ పేలుడు సృష్టించాలన్నది నిందితుడి ఆలోచన. ఒకవేళ విమానాశ్రయం వద్ద సాధ్యం కాకపోతే టెల్ అవీవ్ నగరంలోని ప్రముఖ ఆకాశహర్మ్యాన్ని గానీ, జోర్డాన్ సరిహద్దులోని అమెరికా సైనిక స్థావరాన్ని గానీ లక్ష్యంగా ఎంచుకోవాలని పథకం వేసుకున్నాడు.
ప్రార్థన చేస్తానంటూ వెనుక నుంచి గొడ్డలితో దాడి
అబుదాబి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ మచ్చార్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడిన సందర్భంగా భయానక క్షణాలను పంచుకున్నారు. జోర్డాన్ గగనతలం మీదుగా విమానం దూసుకెళుతున్న వేళ, కాక్‌పిట్‌లో ప్రార్థన చేసుకుంటానని హమ్మామి అనుమతి కోరాడు. పైలట్లు కూర్చొనే సీట్ల వెనక మూడు నిముషాల పాటు ప్రార్థన చేసుకున్నాడు. ఆపై అక్కడే హుక్ చేయబడి ఉన్న అత్యవసర భద్రతా గొడ్డలిని చేతబట్టి ఒక్కసారిగా కెప్టెన్ తలపై బలంగా కొట్టాడు. ఆకస్మిక దాడితో తొలుత విమానం ఏదో ప్రమాదానికి గురైందని భావించినప్పటికీ, వరుస దెబ్బలు పడుతుండటంతో పక్కనే కూర్చున్న తోటి పైలట్టే దాడి చేస్తున్నాడని గుర్తించినట్లు కెప్టెన్ మఛ్ఛార్ చెప్పారు.
సెకన్లలో 16 వేల అడుగులు పడిపోయిన విమానం
కెప్టెన్‌ను నిశ్చేష్టుడిని చేసిన వెంటనే హమ్మామి విమాన ఇంజిన్లను ఆపేశాడు. రడ్డర్లను అమాంతం ముందుకు నెట్టడంతో ఆ విమానం కేవలం సెకండ్ల వ్యవధిలోనే సుమారు 16 వేల అడుగుల ఎత్తును కోల్పోయింది. శబ్దవేగంతో దాదాపు సమానమైన వేగంతో భూమి వైపు దూసుకురావడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఈ భయానక సంక్షోభంలో తీవ్ర రక్తస్రావం జరుగుతున్నా కెప్టెన్ మఛ్ఛార్ తిరగబడ్డారు. ప్రాణాలకు తెగించి సహ పైలట్‌ను ప్రతిఘటించడంతో పాటు ఎమర్జెన్సీ డిస్ట్రెస్ సిగ్నల్స్ పంపించారు. కాక్‌పిట్ తలుపులను చాకచక్యంగా తెరవడంతో ఇతర విమాన సిబ్బంది, ప్రయాణికులు ఒక్కసారిగా లోపలికి చొరబడి హమ్మామిని బంధించారు. విమానంలో ప్రయాణిస్తున్న సెలవుల్లో ఉన్న ఇద్దరు పైలట్ల సహకారంతో సౌదీ అరేబియా భూభాగంలో విమానాన్ని అత్యవసరంగా దించి పెను ముప్పును నివారించారు.
ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగంలో చేరాడు
యూఏఈ అధికారుల విచారణలో నిందితుడు హమ్మామి విస్తుపోయే విషయాలు వెల్లడించాడు. టెల్ అవీవ్ నగరానికి ఏ విమానయాన సంస్థ ఎక్కువగా సర్వీసులు నడుపుతోందో తెలుసుకుని, విమానాన్ని కూల్చాలన్న ముందస్తు పథకంతోనే ఫ్లైదుబాయ్‌లో ఉద్యోగంలో చేరానని చెప్పాడు. జులై నెలలోనే ఈ కుట్రను అమలు చేయాలని చూసినా, సిబ్బందిలో ఒకరు మిత్రుడు కావడంతో వెనక్కి తగ్గాడు. జూన్ నెలలో విమాన విధుల్లో భాగంగా ఇజ్రాయెల్ వెళ్లిన సమయంలో భద్రతా ఏర్పాట్లు, ల్యాండింగ్ విధానాలపై రెక్కీ చేసినట్లు తేలింది.
నిఘా వైఫల్యంపై ఇజ్రాయెల్ వర్గాల్లో తీవ్ర కలకలం
ఉగ్రవాద భావజాలం కారణంగా స్వదేశం ఒమన్‌లోనే నిషేధానికి గురైన హమ్మామికి ఫ్లైదుబాయ్ ఎలా ఉద్యోగమిచ్చిందనే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సిరియా అంతర్యుద్ధ సమయంలో అక్కడే గడిపిన హమ్మామి, అల్ ఖైదాకు అనుకూలంగా గతంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన చరిత్ర ఉంది. ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేని ఒమన్ పౌరుడిని పౌర విమానానికి పైలట్‌గా ఎలా అనుమతించారన్న అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. అటు రవాణా శాఖ, ఇటు దేశీయ భద్రతా సంస్థ షిన్ బెట్ పరస్పరం బాధ్యతలను నెట్టుకుంటుండగా, విమానయాన భద్రతా డొల్లతనంపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.