ప్రతి ఓటరుకూ ఓటేసే అవకాశం కల్పించాలి

Debashis Sen, Basudeb Banerjee
Former Bengal CEOs Debashis Sen and Basudeb Banerjee
Published on: 

* అది సీఈవో, ఈసీ బాధ్యత: బెంగాల్‌ మాజీ సీఈవోలు

* ‘సర్’ ప్రక్రియలో లక్షలాది ఓట్ల తొలగింపుపై ఆందోళన

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో ‘సర్’ ప్రక్రియపై ఆ రాష్ట్ర మాజీ ప్రధాన ఎన్నికల అధికారులు దేబాశిస్ సేన్, బాసుదేవ్ బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. అర్హత గల ప్రతి ఓటరుకూ ఓటేసే అవకాశం కల్పించడం ఎన్నికల కమిషన్ (ఈసీ), సీఈవోల బాధ్యతగా దేబాశిస్ సేన్ పేర్కొన్నారు. అందువల్లే మారుమూల ప్రాంతాల్లోనూ ఓటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఫారం-6లో మార్పులపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, సర్ ప్రక్రియను మరోసారి పరిశీలించాల్సిన అవసరముందని సేన్ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘ఫారం-6లో మార్పులపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల తర్వాత ఏదో అనుమానాస్పదంగా అనిపిస్తోంది. లక్షలాది మంది ఓటర్ల పేర్లు తొలగించడం ఎన్నికల వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఏఐ ఆధారిత వ్యవస్థతో తార్కిక లోపాలు ఉన్నాయని ప్రజల ఓటు హక్కును తొలగించడం సరికాదు’ అని అన్నారు. 2005 నుంచి 2010 వరకు సీఈవోగా పనిచేసిన తన అనుభవాలను దేబాశిస్ సేన్ వివరించారు. మరో మాజీ సీఈవో బాసుదేవ్ బెనర్జీ మాట్లాడుతూ, ‘ఎన్నికల అధికారులు ఈసీ ఆదేశాల ప్రకారమే పనిచేస్తారు. అవసరమైనప్పుడే తమ సూచనలను ఈసీకి తెలియజేస్తారు’ అని అన్నారు. 2004 లోక్‌సభ ఎన్నికల సమయంలో కొన్ని అంశాలపై ఎన్నికల సంఘానికి సూచనలు చేయగా, వాటిలో కొన్నింటిని ఈసీ అంగీకరించి, మరికొన్నింటిని అంగీకరించలేదని తెలిపారు. ఒక అధికారి పనితీరు బాగుందని చెప్పడంతో ఆయన బదిలీ నిలిపివేశారని గుర్తుచేశారు.