

చండీగఢ్: హర్యానా ప్రభుత్వ ఖజానాకు చెందిన 657 కోట్ల రూపాయల నిధులను ప్రైవేట్ బ్యాంకు ఖాతాలకు మళ్లించి కాజేసిన ఉదంతంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మాజీ మేనేజర్ రిభవ్ రిషి సూత్రధారిగా సాగిన ఈ భారీ కుంభకోణంలో పలువురు ఉన్నత స్థాయి ఐఏఎస్ అధికారులు భాగస్వాములైనట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ చార్జ్‌షీటులో పేర్కొంది. ఖజానా సొమ్మును నిర్దిష్ట బ్యాంకు శాఖల్లో జమ చేయించేందుకు సదరు బ్యాంకర్ ఐఏఎస్ అధికారులకు కోట్ల రూపాయల నగదు, బంగారు నాణేలు, విలాసవంతమైన విందులు సమకూర్చినట్లు తేలింది. జీరక్‌పూర్, చండీగఢ్, మొహాలీలోని ప్రముఖ హోటళ్లలో జరిగిన రహస్య విందుల్లో డ్యాన్సర్లు, మహిళా ఎస్కార్ట్లులను ఏర్పాటు చేసి అధికారులను ప్రసన్నం చేసుకున్నారని దర్యాప్తులో స్పష్టమైంది.
సాక్ష్యాల గుర్తింపు, వాంగ్మూలాల నమోదు
ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారుల ఎదుట ప్రత్యక్ష సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. జిరాక్పూర్ ప్రాంతంలోని రిసార్టులో జరిగిన విందులకు హాజరైన ఎస్కార్ట్ మహిళలు ఉన్నతాధికారులను ఫొటోల ద్వారా గుర్తించారు. ఒక ఐఏఎస్ అధికారి పాల్గొన్న కార్యక్రమాలకు సంబంధించి 10 వేల నుంచి 12 వేల రూపాయల వరకు చెల్లింపులు అందుకున్నట్లు వారు వెల్లడించారు. ఢిల్లీ నుంచి పిలిపించిన మరో యువతికి 75 వేల రూపాయలు ముట్టజెప్పినట్లు రికార్డులు బయటపడ్డాయి. డాన్స్ పార్టీల్లో కరెన్సీ నోట్లను విచ్చలవిడిగా గాల్లోకి ఎగరేసిన వైనం, ఆ ఖర్చులన్నీ ప్రభుత్వ ఖజానా నిధులతోనే సమకూర్చారని తేలడం తీవ్ర కలకలం రేపింది.
దర్యాప్తు విస్తరణ.. ఆస్తుల జప్తు
ఈ కుంభకోణంలో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేయగా, 14 మందిపై ప్రత్యేక కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. అక్రమ నగదు చలామణి కోణంలోనూ దర్యాప్తు వేగవంతం చేసి దాదాపు 211 కోట్ల రూపాయల విలువైన స్థిర, చర ఆస్తులను అధికారులు అటాచ్ చేశారు. కోట్ల రూపాయల హవాలా లావాదేవీలు, డొల్ల కంపెనీల ద్వారా జరిగిన నిధుల బదిలీలపై లోతైన పరిశోధన సాగుతోంది. మరికొందరు బ్యూరోక్రాట్ల ప్రమేయంపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతుండటంతో రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.