చీటింగ్‌ చేస్తూ పట్టుబడ్డా.. పరీక్ష పూర్తి చేయొచ్చు! ఐఐటీ బొంబాయి కీలక నిర్ణయం

IIT Bombay
IIT Bombay to announce new anti-cheating policy
Published on: 

సెప్టెంబర్‌ 18న విద్యార్థి సాహిల్‌ వాకోడే ఆత్మహత్య చేసుకున్న ఘటన నేపథ్యంలో పరీక్షల్లో చీటింగ్‌ ఆరోపణలు ఎదురైన విద్యార్థుల విషయంలో అనుసరించాల్సిన విధానాన్ని ఐఐటీ బొంబాయి మార్చేందుకు సిద్ధమైంది. ప్రతిపాదించిన మార్పుల ప్రకారం పరీక్ష సమయంలో విద్యార్థి చీటింగ్‌ చేస్తూ పట్టుబడినా.. వెంటనే పరీక్ష నుంచి బయటకు పంపించరు. ఇన్విజిలేటర్‌ చీటింగ్‌కు సంబంధించిన ఆధారాలను స్వాధీనం చేసుకుని, ఘటన వివరాలను నమోదు చేస్తారు. ఆ తర్వాత విద్యార్థికి కొత్త ఆన్సర్‌ బుక్‌లెట్‌ ఇచ్చి, మిగిలిన సమయాన్ని ఉపయోగించుకుని పరీక్షను పూర్తి చేసుకునే అవకాశం కల్పిస్తారు.

ఇన్విజిలేటర్‌ పాత్ర పరిమితం..విద్యార్ధి వాదనకు అవకాశం

పరీక్ష ముగిసిన తర్వాత విద్యార్థికి తన వైపు నుంచి జరిగిన విషయాన్ని వివరించుకునే అవకాశం ఉంటుంది. చీటింగ్‌ ఘటనపై విద్యార్థి వివరణ లేదా వాదనను ప్రత్యేకంగా నమోదు చేస్తారు. మరోవైపు.. ఇన్విజిలేటర్‌ పాత్రను కేవలం ఘటనను గుర్తించడం, ఆధారాలను స్వాధీనం చేసుకోవడం, నివేదిక రూపొందించడం వరకే పరిమితం చేస్తారు. విద్యార్థిపై ఎలాంటి చర్య తీసుకోవాలన్నది పరీక్ష హాల్లో ఇన్విజిలేటర్‌ నిర్ణయించరు. దీనిపై తుది నిర్ణయం ‘డిసిప్లినరీ యాక్షన్‌ కమిటీ’ తీసుకుంటుంది. ఇదే సమయంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పరీక్ష హాల్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత సంబంధిత విద్యార్థి ఒంటరిగా ఉండిపోకుండా.. అవసరమైన మానసిక సహాయం అందించేందుకు ‘క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌ (QRT)’కు సమాచారం అందిస్తారు. పరీక్ష సమయంలో విద్యార్థిలో తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన వంటి లక్షణాలు కనిపించినా QRTని అప్రమత్తం చేయనున్నారు.

సాహిల్‌ ఘటన.. కమిటీ ఏర్పాటు

సాహిల్‌ వాకోడే సెప్టెంబర్‌ 18న ఆత్మహత్య చేసుకున్న ఘటన తర్వాత పరీక్షల్లో అక్రమ పద్ధతులపై అనుసరించాల్సిన విధానంపై తీవ్ర చర్చ మొదలైంది. దీంతో ఐఐటీ బాంబే డైరెక్టర్‌ షిరీష్‌ కేదారే నలుగురు అధ్యాపకులు, నలుగురు విద్యార్థులతో ఎనిమిది మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పరీక్షల్లో అకడమిక్‌ మిస్‌కండక్ట్‌ను ఎలా నిర్వహించాలనే అంశంపై మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా ప్రస్తుత విధానంలో మార్పులు చేయాలని ఐఐటీ బొంబాయి సూత్రప్రాయంగా నిర్ణయించింది.

కఠిన రూల్స్‌కు బ్రేక్‌

ఐఐటీ బొంబాయి ఈ ఏడాది జులైలో అకడమిక్‌ మిస్‌కండక్ట్‌పై కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. పరీక్షా హాల్లో ఫోన్‌ కలిగి ఉన్నా కఠిన శిక్షలు, కొన్ని సందర్భాల్లో FR (Fail and Repeat) గ్రేడ్‌, ఒక సెమిస్టర్‌ సస్పెన్షన్‌ వంటి చర్యలకు అవకాశం ఉండేది. అయితే తాజా నిర్ణయంతో ఈ కఠిన నిబంధనలను తాత్కాలికంగా నిలిపివేసి, 2015లో అమల్లో ఉన్న తక్కువ కఠినమైన విధానాన్ని తిరిగి తీసుకురావాలని సెనేట్‌ నిర్ణయించింది. అక్టోబర్‌ 10, 11 తేదీల్లో జరగనున్న పెండింగ్‌ మిడ్‌-సెమిస్టర్‌ పరీక్షలకు ఈ తాత్కాలిక విధానం వర్తించనుంది. ఇందులో భాగంగా పరీక్షకు ముందు విద్యార్థులను తనిఖీ చేసే ఫ్రిస్కింగ్‌ను కూడా నిలిపివేశారు. అయితే పరీక్షా భవనంలో ఫోన్‌, స్మార్ట్‌వాచ్‌, ఇయర్‌ఫోన్స్‌ వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు, నోట్స్‌, పుస్తకాలు తీసుకురావడంపై నిబంధనలు కొనసాగుతాయి. పరీక్ష సమయంలో సీసీటీవీ పర్యవేక్షణ ఉండటంతో పాటు, ఒకేసారి ఒక విద్యార్థికి మాత్రమే బయో-బ్రేక్‌ కోసం (టాయిలెట్ బ్రేక్) బయటకు వెళ్లే అవకాశం కల్పించనున్నారు. పరీక్ష ప్రారంభమైన 30 నిమిషాల తర్వాత హాల్లోకి ఎవరినీ అనుమతించరు. సాధారణంగా చేసే భౌతిక శరీర తనిఖీలను నిలిపివేశారు.