

న్యూఢిల్లీ: జన గణన(సెన్సస్) ప్రక్రియ 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జరగనుంది. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, మంచుమయంగా ఉండే ప్రాంతాలు మినహా దేశవ్యాప్తంగా జనాభా లెక్కలను సేకరించనున్నారు. ఈమేరకు వివరాలతో భారత రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ (ఆర్జీఐ) మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ శుక్రవారం ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం.. మణిపూర్, గోవా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, లడఖ్‌లతో పాటు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్‌లలోని మంచు కురిసే కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో ఈ విడతలో జనాభా గణన జరగదు. మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జనగణన జరుగుతుంది. మణిపూర్‌లోని ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా అక్కడ సెన్సస్–2027కి సంబంధించిన ఇళ్ల జాబితా నమోదు ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు గత నెలలోనే ఆర్జీఐ ప్రకటించింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అందుకే ఈ రాష్ట్రాలను జనాభా గణన షెడ్యూల్ నుంచి మినహాయించారు.
ప్రామాణిక సమయం 2027 మార్చి 1
ఈ జనాభా గణనకు 2027 మార్చి 1వ తేదీ అర్ధరాత్రి 00:00 గంటలను ప్రామాణిక సమయంగా నిర్ణయించారు. అంటే, ఆ సమయానికి భారత్‌లో ఎంతమంది జనాభా సజీవంగా ఉన్నారో, వారిని మాత్రమే అధికారిక దేశ జనాభాగా గుర్తిస్తారని అర్థం. జనగణన ముగిసిన తర్వాత 2027 మార్చి 1 నుంచి మార్చి 5 వరకు రివిజనల్ రౌండ్ (తనిఖీ ప్రక్రియ) జరుగుతుందని ఆర్జీఐ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి జనాభాను లెక్కించే ప్రక్రియను ప్రారంభించడానికి ముందే, 2027 జనవరి 10 నుంచి 24 వరకు ప్రజలు ఆన్‌లైన్ ద్వారా వివరాలు నమోదు చేసుకునేందుకు ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని ఆర్జీఐ మృత్యుంజయ్ వెల్లడించారు.
దేశ చరిత్రలోనే అతిపెద్ద మానవ లెక్కింపు
భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరుగుతున్న 8వ జనాభా గణన ఇది. దీన్ని రెండు దశల్లో నిర్వహిస్తారు. తొలి దశలో ఇళ్ల జాబితా నమోదు (హౌస్ లిస్టింగ్), గృహ గణనను నిర్వహించారు. ఇక రెండో దశలో జనాభా లెక్కింపు జరుగనుంది. పదేళ్లకొకసారి జరిగే ఈ జనాభా గణన 2021లోనే జరగాల్సి ఉండగా, కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా వాయిదా పడింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద మానవ లెక్కింపు ప్రక్రియ అయిన ఈ జనాభా గణన కోసం కేంద్ర మంత్రివర్గం రూ. 11,718 కోట్లను మంజూరు చేసింది.
చివరిసారిగా 2011లో గణన
భారత్‌లో చివరిసారిగా 2011లో జనాభా గణన జరిగింది. దేశ జనాభా 121 కోట్లు ఉందని అప్పట్లో గుర్తించారు. ఇందులో 62.32 కోట్ల మంది పురుషులు, 58.75 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఆ సమయానికి దేశంలో మొత్తం 24.95 కోట్ల కుటుంబాలు ఉన్నాయి.