కొలువు కాదు.. కింగ్‌ కావాలి! స్టార్టప్‌ బాటలో జెన్‌ జీ!

కళాశాలలో చదువుకుంటూనే సొంత వ్యాపారం ప్రారంభించిన విద్యార్థులు దేశంలో గణనీయంగానే ఉన్నారు. ప్రతి ఐదుగురు విద్యార్థుల్లో ఒకరు.. అంటే 22 శాతం మంది ఇప్పటికే వ్యాపారాన్ని ప్రారంభించారు.
కొలువు కాదు.. కింగ్‌ కావాలి! స్టార్టప్‌ బాటలో జెన్‌ జీ!
Published on: 

‘చదువు పూర్తయింది.. మంచి ఉద్యోగం సంపాదించాలి’.. దశాబ్దాలుగా భారతీయ యువతలో బలంగా నాటుకుపోయిన ఆలోచన ఇది. కానీ నేటి తరం ఆ ధోరణిని మార్చుకుంటోంది. ఎవరి కిందో నౌకరీ చేసే 'ఉద్యోగి'గా మారడం కంటే.. వందల మందికి ఉపాధి కల్పించే 'యజమాని' (కింగ్) కావడమే తమ లక్ష్యమని స్టార్టప్ బాట పడుతోంది. జాబ్ సీకర్స్ నుంచి జాబ్ క్రియేటర్ గా ఎదగాలని ఆశిస్తోంది. ఐఐటీ మండి (IIT Mandi), బెంగళూరులోని రేవ్‌ (REVA) విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన ‘గెస్ (GUESSS) ఇండియా 2025 జాతీయ సర్వే నివేదిక’లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 1,200కు పైగా ఉన్నత విద్యాసంస్థలకు చెందిన 25,783 మంది విద్యార్థుల అభిప్రాయాలను సేకరించి ఈ నివేదికను రూపొందించారు. భారతీయ విద్యార్థుల్లో పెరుగుతున్న వ్యాపార దృక్పథాన్ని, సొంతంగా ఎదగాలన్న ఆకాంక్షను ఈ సర్వే స్పష్టం చేస్తోంది.

ప్రతి ఐదుగురిలో ఒకరు.. ఇప్పటికే వ్యాపారంలో!

కళాశాలలో చదువుకుంటూనే సొంత వ్యాపారం ప్రారంభించిన విద్యార్థులు దేశంలో గణనీయంగానే ఉన్నారు. ప్రతి ఐదుగురు విద్యార్థుల్లో ఒకరు.. అంటే 22 శాతం మంది ఇప్పటికే వ్యాపారాన్ని ప్రారంభించినట్లు సర్వే వెల్లడించింది. వీరిలో వ్యాపార ఆలోచనలకే పరిమితం కాకుండా, మార్కెట్‌లో ఉత్పత్తులు లేదా సేవలను విక్రయిస్తూ క్రమం తప్పకుండా ఆదాయం పొందుతున్నవారూ ఉన్నారు. విద్యార్థులు ప్రారంభించిన వ్యాపారాల్లో 35.5 శాతం సంస్థలు రెగ్యులర్‌గా విక్రయాలు జరుపుతున్నాయి. మరోవైపు, భవిష్యత్తులో సొంతంగా వ్యాపారవేత్తలుగా ఎదగాలని 43 శాతం మంది విద్యార్థులు ఆకాంక్షిస్తున్నారు.

ఉద్యోగం కంటే సొంత వ్యాపారంపైనే మక్కువ!

చదువు పూర్తయిన వెంటనే ఏదో ఒక ఉద్యోగంలో చేరాలనే ఆలోచనకు బదులుగా.. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే ఆసక్తి పెరుగుతోంది. చదువు పూర్తయిన తర్వాత తక్షణమే సొంత వ్యాపారాన్ని ఎంచుకోవాలనుకునే విద్యార్థుల వాటా 2023లో 14 శాతంగా ఉండగా, 2025 నాటికి 16.2 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి 12.7 శాతం నుంచి 10.1 శాతానికి తగ్గింది. పెద్ద కంపెనీల్లో ఉద్యోగం చేయాలనుకునేవారి వాటా కూడా 31.3 శాతం నుంచి 27.4 శాతానికి పడిపోయింది. ఈ గణాంకాలు యువత కెరీర్‌ ఎంపికల్లో చోటుచేసుకుంటున్న మార్పును సూచిస్తున్నాయి.

ఐటీ.. ఏఐ.. డిజిటల్‌ సేవలపై గురి!

భవిష్యత్తులో వ్యాపారాలు ప్రారంభించాలని భావిస్తున్న విద్యార్థులు సమాచార సాంకేతికత (ఐటీ), కృత్రిమ మేధ (ఏఐ), డిజిటల్‌ సేవల రంగాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే ప్రస్తుతం విద్యార్థులు నిర్వహిస్తున్న వ్యాపారాల్లో డిజిటల్‌ వ్యాపారాల వాటా సుమారు 10 శాతమే. అంటే.. డిజిటల్‌ రంగాల్లో వ్యాపారం చేయాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ, ఆ ఆలోచనలను వాస్తవ వ్యాపారాలుగా మార్చడంలో ఇంకా అంతరం ఉందని సర్వే సూచిస్తోంది.

రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు!

విద్యార్థి వ్యాపారవేత్తలు రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. వ్యాపారంలో ఎదురయ్యే వైఫల్యాలు యువతను వెనక్కి తగ్గించడం లేదని సర్వే గణాంకాలు చెబుతున్నాయి. క్రమం తప్పకుండా విక్రయాలు జరుపుతున్న విద్యార్థుల వ్యాపారాల్లో 31 శాతం 2025లోనే ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ వాటా 18 శాతమే. అంటే భారత్‌లో కొత్త వ్యాపారాలను ప్రారంభించి మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఉంది. గతంలో ఒక వ్యాపారాన్ని ప్రారంభించి, ఆ తర్వాత దాన్ని మూసివేసి మళ్లీ కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టినవారూ ఉన్నారు. క్రమం తప్పకుండా విక్రయాలు జరుగుతున్న వ్యాపారాల వ్యవస్థాపకుల్లో 41 శాతం మంది గతంలో ఒక వ్యాపారాన్ని మూసివేసిన తర్వాత మరో ప్రయత్నం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వాటా 33 శాతంగా ఉంది. అంతేకాదు, 42 శాతం మంది భారతీయ విద్యార్థి వ్యాపారవేత్తలు రెండు లేదా అంతకంటే ఎక్కువ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వాటా 25 శాతమే. మొత్తంగా.. ఉద్యోగాల కోసం వెతికే స్థాయి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలన్న ఆకాంక్ష భారత యువతలో బలపడుతోంది.