

టికెట్ రిజర్వేషన్ చేయించుకున్న రైలు ప్రయాణికులు ఇకపై టెన్షన్ పడనవసరం లేదు. ఒకవేళ ప్రయాణం వాయిదా పడినా? విరమించుకున్నా ఆ టికెట్ నష్టపోతామనే భయం లేదు. ఆ టికెట్‌ను రద్దుచేయాల్సిన అవసరమూ లేదు. అదే టికెట్‌పై మీ కుటుంబ సభ్యులు కానీ, తోటి విద్యార్థులు లేదా సహోద్యోగులు ప్రయాణించవచ్చు.
వేరే పేరుకు బదిలీ చేయొచ్చు
రైలు ప్రయాణం కోసం కొన్ని రోజుల ముందే టికెట్ రిజర్వేషన్ చేసుకుంటాం. తీరా వెళ్లాల్సిన సమయానికి ఏవైనా అవాంతరాలు ఎదురైతే ప్రయాణం వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు క్యాన్సిలేషన్ చార్జీల కింద చాలా డబ్బులు కోల్పోతాం. కొన్ని సందర్భాల్లో టికెట్ నిరుపయోగంగా మారి డబ్బులు మొత్తం నష్టపోవాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రైల్వేశాఖ అద్భుతమైన ఆప్షన్ తీసుకువచ్చింది. మీరు ప్రయాణించలేకపోతే.. ఆ కన్ఫర్మ్ టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చు. అయితే ఇది అందరికీ వర్తించదు. కొన్ని షరతులతో ఈ బదిలీకి అవకాశం ఉంటుంది.
బదిలీ.. ఎలా?
మీ పేరు మీద ఉన్న రిజర్వేషన్ టికెట్‌ను భార్య, భర్త, కుమారుడు, కుమార్తె, తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు.. ఇలా ఈ ఎనిమిది రకాల రక్త సంబంధీకులకు మాత్రమే బదిలీచేసే అవకాశం ఉంటుంది. స్నేహితులకు కుదరదు. ఇందుకోసం రైలు బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందుగా.. చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీ స్థానంలో ప్రయాణించబోయే వారి ఐడీ ప్రూఫ్‌ను విధిగా చూపించాల్సి ఉంటుంది.
విద్యార్థులైతే..
స్కూల్ లేదా కాలేజీ తరఫున విద్యా యాత్రలకు వెళ్లే విద్యార్థులైతే అదే విద్యాసంస్థకు చెందిన మరో విద్యార్థికి బదిలీ చేసే అవకాశం ఉంది. దీనికోసం ఆ విద్యాసంస్థ హెడ్ రెండు రోజులు ముందే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అలాగే పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం ఒక బృందంగా వెళ్లే వారిలో ఎవరైనా ప్రయాణించకపోతే వారి స్థానంలో ఇతరులను పంపవచ్చు. గ్రూప్ లీడర్ 48 గంటల ముందు అప్లయ్ చేయాలి.
ప్రభుత్వ ఉద్యోగులు
విధుల్లో భాగంగా ప్రయాణించే ప్రభుత్వ ఉద్యోగి తన ప్రయాణం రద్దయితే మరో ఉద్యోగి పేరు మీద ఆ టికెట్‌ను బదిలీ చేయొచ్చు. ఎన్‌సీసీ క్యాడెట్ల బృందంలో కూడా ఒకరికి బదులు మరొకరిని పంపే వెసులుబాటు ఉంది. వీరు రైలు బయలుదేరడానికి 24 గంటల ముందు సంబంధిత అధికారికి తెలియజేయాలి.
ఒక్కసారి మాత్రమే..
టికెట్ ట్రాన్స్‌ఫర్ ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది. అంటే ఒకసారి ఒకరి పేరు మీదకు బదిలీ చేసిన టికెట్‌ను తిరిగి మళ్లీ ఇంకొకరి పేరు మీదకు మార్చడం కుదరదు. రైల్వే అందిస్తున్న ఈ ప్రయోజనం ప్రయాణికులకు మంచి అవకాశం కానుంది.