పట్టాలెక్కిన ఎల్‌ఎన్‌జీ రైలు

ఇంధన కొరతకు మేలైన ప్రత్యామ్నాయం
India's first LNG dual fuel train
India's first LNG dual fuel train
Published on: 

అహ్మదాబాద్: భారతీయ రైల్వే సరికొత్త హరిత విప్లవానికి నాంది పలికింది. మొన్న హైడ్రోజన్ రైలు ప్రారంభించి సంచలనం సృష్టించగా ఇప్పుడు ఎల్‌ఎన్‌జీ రైలును కూడా ప్రవేశపెట్టి మరో రికార్డును సొంతం చేసుకుంది. డీజిల్‌ వినియోగాన్ని గణనీయంగా తగ్గించే అత్యాధునిక లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) ఆధారిత డ్యూయల్ ఫ్యూయల్ రైలును పట్టాలెక్కించింది. గ్యాస్, డీజిల్‌ కలయికతో నడిచే ప్రత్యేక ఇంజిన్‌తో ఈ రైలు పనిచేస్తుంది. ఆపరేషన్ సమయంలో సుమారు 40 శాతం డీజిల్ వినియోగాన్ని ఎల్‌ఎన్‌జీ భర్తీ చేస్తుంది. ఇంధనం లభ్యతను బట్టి ఎలాంటి మ్యానువల్ ప్రమేయం లేకుండానే దానంతటదే గ్యాస్ లేదా డీజిల్‌కు మారిపోయే సాంకేతికత ఈ రైలింజిన్ సొంతం. ఇంజిన్ సామర్థ్యంలో గానీ, వేగంలో గానీ ఎలాంటి తేడా ఉండదు.

ఒక్కసారి నింపితే ముంబై నుంచి కోల్‌కతా దూరం

అహ్మదాబాద్‌ సబర్మతి ఇంటిగ్రేటెడ్ కోచింగ్ డిపోలో 1,400 హెచ్‌పీ సామర్థ్యం గల రెండు డ్రైవింగ్ పవర్ కార్ల (డీపీసీ)ను డ్యూయల్ ఫ్యూయల్ ఇంజిన్లుగా మార్చారు. క్షేత్రస్థాయిలో దాదాపు 2,000 కిలోమీటర్ల మేర ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్నాకే పట్టాలపైకి తెచ్చారు. ప్రతి డీపీసీలో 2,200 లీటర్ల సామర్థ్యం గల ఎల్‌ఎన్‌జీ ట్యాంకు ఉంటుంది. ఒక్కసారి నింపినప్పుడు దాదాపు 850 నుంచి 900 కిలోల గ్యాస్ పడుతుంది. ఒక్కసారి ట్యాంకు ఫుల్ చేస్తే ఇంధనం కోసం ఆగకుండా 1,600 కిలోమీటర్లు సునాయాసంగా దూసుకుపోతుంది.

రైల్వేకు భారీగా నిధుల ఆదా

ఈ ప్రయోగంతో ఒక్క డీపీసీ ద్వారా ఏడాదికి సుమారు రూ.11.9 లక్షల ఖర్చు ఆదా అవుతుందని రైల్వే వర్గాలు అంచనా వేశాయి. 2 డీపీసీలుండే 8 బోగీల పూర్తి రైలుతో ఏడాదికి ఏకంగా రూ.23.9 లక్షల వరకు మిగులుతుంది. భవిష్యత్తులో విస్తృత స్థాయిలో ప్రవేశపెట్టడం వల్ల ఖజానాకు భారీ లబ్ధి చేకూరుతుంది. 40 శాతం డీజిల్ తగ్గడం వల్ల కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, సూక్ష్మ ధూళికణాల ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. 2030 నాటికి డీజిల్ వినియోగాన్ని శూన్యానికి తీసుకురావాలన్న రైల్వే విస్తృత లక్ష్యంలో ఇది కీలక ముందడుగు కానుంది.