

న్యూఢిల్లీ : రైల్వేలో ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా లోకో పైలట్ల రక్తంలో 'జీరో శాతం ఆల్కహాల్' ఉండాలనే నిబంధనను అధికారులు అత్యంత కఠినంగా అమలు చేస్తున్నారు. అయితే, మద్యం సేవించని లోకోపైలట్లకు సైతం శ్వాస పరీక్షల్లో ఆల్కహాల్ ఆనవాళ్లు నమోదు కావడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. కొన్ని రకాల మెడిసిన్‌లు వాడటం వల్ల లేదా కొన్ని రకాలైన ఆహార పదార్ధాల సేవనం కారణంగా కూడా ఇలా జరిగే అవకాశం ఉందంటున్నారు వైద్యనిపుణులు. పొరపాటున ఇలాంటి ఆనవాళ్లు రికార్డైతే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదని లోకోపైలట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భద్రతా చర్యల కోసం
ఈ నిబంధనను పునఃసమీక్షించాలని యూనియన్లు కోరుతున్నప్పటికీ, రైల్వే అధికారులు మాత్రం స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికుల ప్రాణాలు తమకు అత్యంత ముఖ్యం కాబట్టి భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు. లక్షలాది మంది ప్రయాణికుల ప్రాణాలు తమకు అత్యంత ముఖ్యమని, విధుల్లో ఉన్నప్పుడు పూర్తి అప్రమత్తత అవసరమని , మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందేనని తేల్చి చెప్పారు.
తప్పుల్లేని పరీక్షలు కావాలి
ఈ నిబంధనలపై స్పందిస్తూ ఒక రైల్వే సంఘం నేత మాట్లాడుతూ, "లోకో డ్రైవర్లకు ఈ నిబంధనలు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి కాబట్టి శాస్త్రీయ పరీక్షలను మరింత మెరుగుపరచాలి" అని అన్నారు. ఏ తప్పూ చేయని డ్రైవర్లకు ఈ నిబంధనలు పెను భారంగా మారతాయని లోకోపైలట్ యూనియన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు ఉద్యోగం కోల్పోయే పరిస్థితి వస్తుందని వాపోతున్నారు. పొరపాట్లకు ఆస్కారం లేకుండా శాస్త్రీయ పద్ధతులను అనుసరించి, ఫలితాలను నిర్ధారించేందుకు తగిన విధానం ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.