రైళ్ల పరిశుభ్రతపై ప్రత్యేక నిఘా

40 గంటల సుదీర్ఘ ప్రయాణాలు చేసే రైళ్లపై దృష్టి
Indian Railways
Indian Railways Sanitation Monitoring
Published on: 

న్యూఢిల్లీ: సుదీర్ఘ దూరం ప్రయాణించే ప్రయాణికులకు మెరుగైన సేవలందించే దిశగా భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణ సమయం 40 గంటలకు పైగా ఉండే 11 ప్రత్యేక రైళ్లలో పారిశుధ్య నిర్వహణను ముమ్మరంగా పర్యవేక్షించాలని రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. బయలుదేరే ఆరంభ స్టేషన్లలో మాత్రమే కాకుండా, గమ్యస్థానాన్ని చేరుకునే వరకు ప్రతి దశలోనూ బోగీలు శుభ్రంగా ఉండేలా చూడటమే ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశం. అక్టోబర్ 3న విడుదలైన సర్క్యులర్ ప్రకారం ఆయా రైల్వే జోన్లు ఈ ప్రత్యేక పర్యవేక్షణ బాధ్యతలను తక్షణమే చేపట్టాలని స్పష్టం చేశారు.

 సుదీర్ఘ ప్రయాణాల్లో పారిశుధ్య లోపం

రెండు మూడు రోజుల పాటు పట్టాలపై పరుగులు తీసే రైళ్లలో పరిశుభ్రత లోపించడం ప్రయాణికులకు శాపంగా మారుతోంది. ప్రయాణం మొదలైన కొద్ది గంటలకే వాష్‌రూమ్‌లు దుర్వాసన వెదజల్లడం, నీటి సరఫరా నిలిచిపోవడం వంటి సమస్యలు నిత్యకృత్యమయ్యాయి. బోగీల మూలల్లో పేరుకుపోయే చెత్తాచెదారం, సీట్ల కింద పడే ఆహార వ్యర్థాలు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. కిటికీ అద్దాలపై పేరుకుపోయే దుమ్ము, డస్ట్‌బిన్లు నిండిపోయి కారిపోయే వ్యర్థాలు బోగీలోని గాలిని సైతం కలుషితం చేస్తున్నాయి. చిన్న చిన్న మరమ్మతులు సమయానికి చేయకపోవడంతో సుదూర ప్రయాణం కాస్తా ప్రయాణికులకు నరకంగా మారుతోంది.

 పర్యవేక్షణ పరిధిలోకి ప్రముఖ ఎక్స్‌ప్రెస్‌లు

బోర్డు విడుదల చేసిన 11 రైళ్ల జాబితాలో దేశంలోనే అత్యధిక దూరం ప్రయాణించే వివేక్ ఎక్స్‌ప్రెస్ అగ్రస్థానంలో ఉంది. దాదాపు 4,158 కిలోమీటర్ల మేర సాగే ఈ రైలు తిరుగు ప్రయాణ సమయం 170 గంటలుగా ఉంటుంది. ఇంత సుదీర్ఘ సమయం ప్రయాణించే రైలుతో పాటు అవధ్ అస్సాం ఎక్స్‌ప్రెస్, అమ్రపాలి ఎక్స్‌ప్రెస్, జీలం ఎక్స్‌ప్రెస్ వంటి కీలక సర్వీసులను అధికారులు ఈ జాబితాలో చేర్చారు. ఆయా రైళ్లు ప్రయాణించే మార్గంలో ఎంపిక చేసిన ప్రధాన స్టేషన్లలో హౌస్‌కీపింగ్ సిబ్బంది ఎప్పటికప్పుడు బోగీల్లోకి ప్రవేశించి వ్యర్థాలను తొలగించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.

 రైల్వే బోర్డు కఠిన మార్గదర్శకాలు

రైలు బయలుదేరిన తర్వాత గమ్యం చేరేవరకు పారిశుధ్య పర్యవేక్షణను ఒక నిరంతర ప్రక్రియగా మార్చాలని బోర్డు అన్ని జోన్లను ఆదేశించింది. ఆన్‌బోర్డ్ హౌస్‌కీపింగ్ సర్వీస్ ద్వారా ప్రయాణంలో తలెత్తే పారిశుధ్య లోపాలను వెంటనే సరిదిద్దాలని పేర్కొంది. ప్రయాణికుల నుంచి వచ్చే ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో వేగంగా పరిష్కరించే వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. బోగీలలో క్రిమిసంహారక మందులు చల్లడం, వాష్‌బేసిన్ల పరిశుభ్రత, తడి పొడి చెత్తను వేరుచేసి పారబోసే విధానాలను సిబ్బంది పక్కాగా అమలు చేయాలని నిబంధనలు విధించారు. ప్రయాణికుల ఆరోగ్య భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు తేల్చిచెప్పారు.

 కాలుష్యపు కోరల్లో సామాన్యుడి ప్రయాణం

రైలు ప్రయాణంలో కనిపించే అసలైన దయనీయ దృశ్యం జనరల్, స్లీపర్ బోగీలలోని తీవ్ర కాలుష్యమే. కిక్కిరిసిన ప్రయాణికుల మధ్య వాష్‌రూమ్‌ల సమీపంలో వెలువడే తీవ్ర దుర్వాసన ప్రయాణికులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సీట్ల కింద విసిరేసిన ప్లాస్టిక్ సీసాలు, ఎంగిలి పొట్లాలు, కాగితపు వ్యర్థాలు రోజుల తరబడి కుళ్ళిపోయి దోమలు, బొద్దింకలు చేరడానికి కారణమవుతున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు ఈ అపరిశుభ్ర వాతావరణం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు, ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. ఈ అపరిశుభ్రత సమస్యలను పూర్తిగా రూపుమాపి, సామాన్య ప్రయాణికుడికి స్వచ్ఛమైన ప్రయాణ అనుభూతిని అందించడమే లక్ష్యంగా తాజా నిఘా కార్యాచరణ మొదలైంది.