ఇరాక్‌కు భారత బాస్మతి రైస్ ఎగుమతులు

Basmati Rice Freight Cost Reduction
IREF aims to reduce transportation costs by 74 percent by shipping rice to Iraq via bulk vessels
Published on: 

న్యూఢిల్లీ: గల్ఫ్ దేశాలతో వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసే దిశగా భారతీయ రైస్ ఎక్స్‌పోర్టర్స్ ఫెడరేషన్ (ఐఆర్‌ఈఎఫ్‌) మునుపెన్నడూ లేని విధంగా భారీ అడుగు వేసింది. కంటైనర్ కొరత, రవాణా అడ్డంకులను అధిగమించే లక్ష్యంతో ఇరాక్‌కు మూడు భారీ బల్క్ నౌకల ద్వారా 1,02,210 మెట్రిక్ టన్నుల బాస్మతి బియ్యాన్ని తరలించే ఏర్పాట్లు పూర్తి చేసింది. రవాణా ఖర్చులను ఏకంగా 74 శాతం మేర తగ్గించడమే లక్ష్యంగా ఈ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు.

 సింగపూర్ సంస్థతో భాగస్వామ్యం

సింగపూర్‌కు చెందిన ఎగ్జిమ్‌వాలా సొల్యూషన్స్‌తో కలిసి ఐఆర్‌ఈఎఫ్‌ ఈ చారిత్రక రవాణా ప్రణాళికను అమలు చేసింది. కంటైనర్ల ద్వారా రవాణా చేస్తే టన్నుకు సుమారు 350 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుండగా, తాజా బల్క్ నౌకల ద్వారా ఈ ఖర్చు కేవలం 90 డాలర్లకు తగ్గింది. దీనివల్ల టన్నుకు 260 డాలర్ల వరకు భారీగా ఆదా అయ్యే అవకాశం ఉంది. ఈ మూడు నౌకల రవాణా కార్యక్రమం ద్వారా మొత్తంగా దాదాపు 2 కోట్ల 66 లక్షల డాలర్ల మేర రవాణా వ్యయం ఆదా కావచ్చని అంచనా వేశారు.

 ఉమ్ కస్రి పోర్టుకు చేరిన నౌక

ఇరాక్‌లోని ఉమ్ కస్రి పోర్టుకు మూడు నౌకలు బియ్యం తరలించనున్నాయి. 36,810 \ టన్నుల బియ్యంతో కూడిన 'ఎంవీ లమార్ ఎస్' నౌక ఇప్పటికే పోర్టుకు చేరుకుని బెర్త్ నంబర్ మూడు వద్ద బియ్యం అన్ లోడింగ్ ప్రక్రియను ప్రారంభించింది. మిగతా రెండు నౌకలు 'ఎంవీ లోలో గేట్', 'ఎంవీ అవుట్‌లాండర్' వరుసగా 25,500, 39,900 వందల టన్నుల బియ్యంతో పయనం కానున్నాయి. మధ్యప్రాచ్య మార్కెట్లో భారతీయ ఎగుమతిదారులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని అధికారులు వెల్లడించారు.

 భారత ఎగుమతులకు ఊతం

గత మార్చి నాటికి ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మధ్యప్రాచ్య దేశాలకు భారత్ సుమారు 45.64 మిలియన్ టన్నుల బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసింది. దీని విలువ 30,000 కోట్ల రూపాయలకు పైమాటే. మొత్తం బాస్మతి ఎగుమతులలో ఈ ప్రాంతం వాటా దాదాపు 70 శాతంగా ఉంది. సౌదీ అరేబియా మొదటి స్థానంలో నిలవగా, ఇరాన్, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఒక్క ఇరాక్‌కే 7,64,000 టన్నుల భారతీయ బాస్మతి బియ్యం దిగుమతి అయ్యాయి.

 భవిష్యత్ కార్యాచరణ

భారతీయ ఎగుమతిదారులకు, విదేశీ కొనుగోలుదారులకు మెరుగైన రవాణా సదుపాయాలు మేలు చేస్తాయని ఐఆర్‌ఈఎఫ్‌ జాతీయ ఉపాధ్యక్షుడు దేవ్ గార్గ్ పేర్కొన్నారు. ఇతర గల్ఫ్ దేశాలకు కూడా ఇలాంటి వాణిజ్యపరమైన ప్రయోజనకరమైన పరిష్కారాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలోని భారత్ మండపంలో అక్టోబర్ 23 నుండి 25 వరకు జరగనున్న భారత్ అంతర్జాతీయ రైస్ కాన్ఫరెన్స్ (బీఐఆర్‌సీ) 2026 సదస్సుకు ముందు ఈ సరికొత్త చొరవ ప్రాధాన్యం సంతరించుకుంది. 'వన్ నేషన్, వన్ ట్రేడ్, వన్ పాలసీ' దార్శనికతలో భాగంగా వాణిజ్య ఖర్చులను తగ్గించి, అంతర్జాతీయ మార్కెట్లలో భారత్ ఎగుమతుల సత్తాను చాటడమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని ఐఆర్‌ఈఎఫ్‌ ప్రకటించింది.