చైనాతో ఉద్రిక్తతలు నిజమే

అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుల్లో చైనా సైనికులతో ఫేస్‌ఆఫ్‌ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఐటీబీపీ డీజీ శత్రుజీత్‌ కపూర్‌ వెల్లడించారు.
ITBP DG Shatrujeet Kapur
ITBP DG Shatrujeet Kapur confirmed that face-offs between Indian and Chinese troops had occurred at multiple locations in Arunachal Pradesh
Published on: 

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో కొద్ది కాలంగా చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, ఇంకా కొనసాగుతున్నాయని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) డైరెక్టర్ జనరల్ శత్రుజీత్ కపూర్ వెల్లడించారు. ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న ఆయన రాజస్థాన్‌ అల్వార్‌లోని ఐటీబీపీ స్థావరంలో గురువారం సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘గత కొద్ది రోజులుగా అరుణాచల్‌లోని పలు ప్రాంతాల్లో ఇరు దేశాల సైనికుల మధ్య ఫేస్​ఆఫ్​ పరిస్థితులు తలెత్తాయి. అవి నేటికీ కొనసాగుతున్నాయి’ అని తెలిపారు. కొత్తగా ఏర్పాటైన ప్రత్యేక దళం ‘శౌర్య కమాండోలు’ చైనా సైనికులను దీటుగా ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇకపై ప్రతి సరిహద్దు బెటాలియన్‌లోనూ ఈ కమాండోలు ఉంటారని స్పష్టం చేశారు.

డ్రోన్లు, ఆధునిక సాంకేతికతే కీలకం

చైనాతో ఉన్న సరిహద్దు భారత్​కు అత్యంత సంక్లిష్టమైనదని, ఆ దేశమే మనకు అతిపెద్ద ప్రత్యర్థి అని ఐటీబీపీ డీజీ అన్నారు. చైనా తన సైన్యాన్ని ఆధునీకరించి భారీగా పెట్టుబడులు పెట్టిందని, సంప్రదాయ పద్ధతులతో వారిని ఎదుర్కోవడం కష్టమని పేర్కొన్నారు. డ్రోన్లు ప్రధాన సవాలుగా మారాయన్నారు. డ్రోన్, యాంటీ డ్రోన్ సేవలను మరింత అందిపుచ్చుకోవాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. గల్వాన్ తరహా పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా ఐటీబీపీ జవాన్లకు ‘స్ట్రయిక్’ పేరిట కొత్త శిక్షణా కోర్సును రూపొందించామని, 2027 చివరి నాటికి దళం మొత్తానికి ట్రైనింగ్​ పూర్తిచేస్తామని ఆయన తెలిపారు. అయితే ఐటీబీపీ చీఫ్ వ్యాఖ్యలు సాధారణ బలగాల మోహరింపు, సరిహద్దులో భద్రత గురించి ఉద్దేశించి చేసినవి మాత్రమేనని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. 1962లో ఏర్పాటైన ఐటీబీపీ.. భారత్-చైనా మధ్య ఉన్న 3,488 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట విధులు నిర్వహిస్తోంది.