వైఫల్యాలపై వేడుకలా?

Jairam Ramesh
Jairam Ramesh expresses concern that the country is heading towards an economic crisis
Published on: 

- రెపో రేటు పెంచిన ఆర్బీఐ

- మోదీ 25 ఏళ్ల వేడుకలపై జైరాం రమేశ్ విమర్శలు

ప్రభాత ఉదయం, న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విరుచుకుపడింది. దేశం ఆర్థిక సంక్షోభం వైపు దూసుకుపోతుంటే, ప్రధాని మాత్రం తన 25 ఏళ్ల సంబురాల్లో మునిగిపోయారని ఎద్దేవా చేసింది. 1961లో వచ్చిన దేవానంద్ చిత్రం ‘హమ్ దోనో’లోని ప్రసిద్ధ గీతం ‘బర్బాదియోం కా జశ్న్ మనాతా చలా గయా, హర్ ఫిక్ర కో ధుయేం మే ఉడాతా చలా గయా..’ (వైఫల్యాలను వేడుకగా చేసుకుంటూ ముందుకు సాగాను, వాటిన్నంటినీ గాలిలోకి వదిలేశాను..) అనే పాటను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు.  

 పండుగల సీజన్ ప్రారంభమవుతున్న క్రమంలో ఆర్‌బీఐ రెపో రేటు పెంచడం వల్ల ఇప్పటికే తీసుకున్న రుణాల ఈఎంఐలు, కొత్తగా తీసుకునే రుణాలపై వడ్డీ భారం మరింత పెరుగుతుందని ఒక మీడియా కథనాన్ని జతచేస్తూ ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆర్‌బీఐ  రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చిన విషయం తెలిసిందే.

 ప్రజలపై రుణభారం, ఆర్థిక మాంద్యం దిశగా దేశం

ఈ పెంపు సామాన్య ప్రజలపై రుణభారాన్ని మరింత పెంచుతుందని జైరాం రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. రుణాలు భారం పెరగడం, అలాగే ఖర్చులు, పెట్టుబడులు అధికమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా వ్యాపారాలు క్షీణిస్తాయని పేర్కొన్నారు.

నిరుద్యోగం, తగ్గిపోతున్న ఆదాయం వల్ల ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్టాక్ మార్కెట్ నిరంతరం పతనమవుతోందని, తొమ్మిది నెలల్లో విదేశీ పెట్టుబడిదారులు రూ.4 లక్షల కోట్ల మేర భారత మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నారన్నారు. రూపాయి విలువ దారుణంగా పడిపోయిందని, ఇవన్నీ దేశ ఆర్థిక వ్యవస్థ అగాధంలోకి జారుకుంటోందనడానికి సంకేతాలని విమర్శించారు.

 జీడీపీపై ప్రభుత్వం చేస్తోన్న నకిలీ ప్రచారాల హోరులో ప్రజలు నలిగిపోతున్నారన్నారు. ‘‘దొంగ ఓట్లు, మోసంతో ఏర్పడిన ప్రభుత్వానికి ప్రజల గురించి ఏమాత్రం పట్టదు, ఎందుకంటే ఎన్నికల సంఘం వారి గుప్పిట్లోనే ఉంది.’’అని రమేశ్ ఆరోపించారు.

 ప్రజల సమస్యలను గాలికొదిలేసి మోదీ తన 25 ఏళ్ల ‘వైభవాన్ని’ వేడుకలు జరుపుకోవడంలో నిమగ్నమయ్యారని, ‘హమ్ దోనో’ సినిమాలోని ఆ పాట ప్రస్తుత పాలకుల వైఖరికి సరిగ్గా సరిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు.