

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్.. నిరసనలు, ఆందోళనలకు చిరునామా! ఇటీవల నిరసన ప్రదేశాల జాబితా నుంచి జంతర్ మంతర్ నుంచి తొలగించారు. అయితే జంతర్ మంతర్ ఆందోళనలే ఓ వీడియో గేమ్‌గా రూపుదిద్దుకోవడం ఆసక్తి రేపుతోంది. చిన్నారుల నుంచి యువత, పెద్దల వరకు ఆస్వాదించేలా రూపొందించిన ‘జంతర్ మంతర్ చలో’ అనే 3డీ మల్టీప్లేయర్ వెబ్ గేమ్ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.
ఆన్లైన్లో ‘బగ్స్రైటర్’ (bugswriter) పేరుతో గుర్తింపు పొందిన ఉత్తరప్రదేశ్ బరేలీకి చెందిన 27 ఏళ్ల ఐటీ నిపుణుడు, డెవ్ఆప్స్ ఇంజనీర్ సూరజ్ కుశ్వాహ్ దీన్ని రూపొందించారు. అక్టోబర్ 14న ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీలో నిరసనకారులు ఎదుర్కొంటున్న అడ్డంకులను వ్యంగ్యాత్మకంగా గేమ్‌లో చూపించారు. ఇందులో ఆటగాళ్లు నిరసనకారులుగా లేదా ఢిల్లీ పోలీసులుగా రెండు పాత్రల్లో ఆడొచ్చు. నిరసనకారులుగా ప్రజలను సమీకరించి, బారికేడ్లను దాటుకుని జంతర్ మంతర్ చేరుకోవాలి. పోలీసుల పాత్రలో లాఠీలు, టియర్ గ్యాస్‌తో ర్యాలీని అడ్డుకోవచ్చు. ఇంటర్నెట్ నిలిపివేత, దూర ప్రాంతాలకు తరలించే నిర్బంధం వంటి అంశాలూ ఇందులో ఉన్నాయి. గేమ్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడటం ద్వారా ప్రొటెస్టర్స్ తమ ప్రాభవాన్ని పెంచుకోవచ్చు లేదా జనాలను ఆకర్షించవచ్చు. పోలీసులు ప్రయోగించే టియర్ గ్యాస్ నిరసనకారుల వేగాన్ని తగ్గిస్తుంది. వాటర్ క్యానట్ల ముందు నిలబడి డ్యాన్స్ చేయడం లేదా ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటి ఫన్నీ ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉన్నాయి. గోల్గప్పాలతో స్టామినా పెంచుకోవడం వంటి సరదా అంశాలు కూడా గేమ్‌లో ప్రత్యేక ఆకర్షణ.
వెబ్సైట్ ద్వారా ఉచితంగా ఆడొచ్చు. యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సూరజ్ తెలిపిన వివరాల ప్రకారం, గేమ్ ఆన్‌లైన్‌లోకి వచ్చిన తర్వాత ఒక సమయంలో 2,000 మందికి పైగా ఆడుతున్నారు. ఈ గేమ్ వైరల్ కావడంతో, దీనిని స్పూర్తిగా తీసుకుని మరికొన్ని రాజకీయ, వ్యంగ్య వెబ్ గేమ్‌లు (ఉదాహరణకు: భాగ్ నేహా భాగ్ వంటివి) కూడా ఆన్లైన్లో పుట్టుకొస్తున్నాయి.