ఈ నెలాఖరులోనే జియో ఐపీఓ ?

జియో ఈ అక్టోబర్ నెలాఖరులోనే స్టాక్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. దాదాపు రూ.30,000 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా ఈ మెగా ఐపీఓ రాబోతోంది.
Jio Platforms IPO 2026
Published on: 

ముంబై: అనతికాలంలోనే విజయాన్ని అందుకున్న టెలికాం దిగ్గజం జియో అక్టోబరులోనే స్టాక్​ మార్కెట్​లోకి గ్రాండ్​ ఎంట్రీ ఇవ్వనుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ఇనీషియల్​ పబ్లిక్​ ఆఫరింగ్​ (ఐపీఓ) అవుతుందంటూ మార్కెట్​ వర్గాల్లో వాడివేడి చర్చ నడుస్తోంది. దీని ద్వారా దాదాపు రూ.28,755 కోట్ల నుంచి రూ.30,200 కోట్లను సమీకరించాలని జియో ప్లాట్‌ఫామ్స్ లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తోంది. ఇందుకోసం ఇంచుమించు 27 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనుందని సమాచారం. ఒక్కో షేరు ధర రూ.1,065 నుంచి రూ.1,119 రేంజ్​లో ఉంటుందనే టాక్​ వినిపిస్తోంది.

ఎంట్రీతోనే టాప్ 3లోకి

జియో ప్లాట్‌ఫామ్స్ ఈ ఐపీఓ ద్వారా రూ.10.3 లక్షల కోట్ల నుంచి రూ.13 లక్షల కోట్ల వరకు మార్కెట్ వ్యాల్యుయేషన్‌ను కోరుకుంటోంది. ఒకవేళ ఈ వ్యాల్యుయేషన్‌తో స్టాక్ మార్కెట్​లో జియో లిస్ట్ అయితే, భారత్​లోనే అత్యంత విలువైన టాప్ 3 లేదా టాప్ 4 కంపెనీలలో ఒకటిగా నిలుస్తుంది. తన పోటీ సంస్థ అయిన భారతీ ఎయిర్‌టెల్ వ్యాల్యుయేషన్‌కు ఇది దాదాపు సమానంగా లేదా కొద్దిగా అటుఇటుగా ఉంటుంది. ఈ రికార్డు వ్యాల్యుయేషన్ కారణంగానే, జియో కేవలం తన 2.93 శాతం వాటాను (27 కోట్ల షేర్లు) మార్కెట్లోకి విడుదల చేసి రూ.30,200 కోట్లకుపైగా నిధులను సమీకరించబోతోంది.

షేర్​ ధరపై సర్వత్రా ఆసక్తి

ఐపీఓ వివరాలపై ఇప్పటివరకు రిలయన్స్​ ఇండస్ట్రీస్ అధికారిక ప్రకటనేదీ విడుదల చేయలేదు. ఐపీఓకు సంబంధించిన ముసాయిదా పత్రాల(డ్రాఫ్ట్​ రెడ్​ హెర్రింగ్​ ప్రాస్పెక్టస్​ – డీఆర్​హెచ్​పీ)ను ఈ ఏడాది జూన్​ 19నే మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' వద్ద జియో ప్లాట్‌ఫామ్స్ దాఖలు చేసింది. దీన్ని ఆగస్టు 28న సెబీ ఆమోదించింది. ఇక చివరగా అక్టోబరు మూడోవారంలోగా రెడ్​ హెర్రింగ్​ ప్రాస్పెక్టస్​ పత్రాలను రిజిస్ట్రార్​ ఆఫ్​ కంపెనీస్​కు జియో సమర్పిస్తుందని మార్కెట్​ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఆ వెంటనే అధికారికంగా జియో ఐపీఓ తేదీలు, ధరల శ్రేణి వివరాలు ఖరారవుతాయి.

జియో ఐపీఓ అక్టోబరు 21 నుంచి 23 మధ్య ప్రజల సబ్‌స్క్రిప్షన్ కోసం రావచ్చని పేర్కొంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇది పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ మాత్రమే. అంటే ప్రస్తుత ప్రమోటర్లు (రిలయన్స్) గానీ, మెటా, గూగుల్ వంటి ఇతర ప్రధాన వాటాదారులు గానీ తమ వాటాలను విక్రయించడం లేదు. ఐపీఓ ద్వారా వచ్చే నిధులన్నీ నేరుగా జియోకే అందుతాయి.