తప్పుడు ప్రచారంతో సైన్యం ప్రతిష్ఠ దిగజారుస్తారా?

అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా ఆక్రమణలంటూ కాంగ్రెస్‌ నేతలు పోస్ట్‌ చేసిన వీడియోలు నకిలీవని భారత సైన్యం స్పష్టం చేసింది. దీనిపై కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పాలని కిరణ్‌ రిజిజు డిమాండ్‌ చేశారు.
Kiren Rijiju
Kiren Rijiju
Published on: 

న్యూదిల్లీ: భారత సైన్యం ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించిన కాంగ్రెస్​ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్​ రిజిజు డిమాండ్​ చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా భూభాగాలను ఆక్రమించిందంటూ కాంగ్రెస్‌ నేతలు సోషల్​ మీడియాల్లో నకిలీ వీడియోలు పోస్ట్​ చేయడంపై మండిపడ్డారు. ‘కాంగ్రెస్​ చర్యలు దేశ ద్రోహంతో సమానం’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. కాగా, వీడియో మార్ఫింగ్‌ చేసినదైనా అందులో చెప్పిన విషయం సరైనదేనని ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వినోద్‌ ఝాకర్‌ సమర్థించుకున్నారు. ‘దిల్లీలో యువత నిరసనలను అడ్డుకునేందుకు భద్రతా బలగాలను మోహరిస్తున్న బీజేపీ.. అరుణాచల్‌లో చైనా చొరబాట్లను అడ్డుకోవడానికి ఎందుకు సైన్యాన్ని ఉపయోగించడం లేదు?’ అని ప్రశ్నించారు.

వీడియోలు నకిలీవి: ఆర్మీ

కాంగ్రెస్‌ బిహార్‌ అధికార ప్రతినిధి రీతూ చౌధురి రెండు వీడియోలను సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. దీనిపై భారత సైన్యం స్పందించింది. ‘కాంగ్రెస్​ లీడర్లు సోషల్​ మీడియాలో పోస్ట్ చేసిన​ వీడియోలు నకిలీవి. మొదటి వీడియో సిక్కింలోని నాథూ లా కనుమ వద్ద రికార్డు చేసింది. అక్కడ భారత్‌-చైనా మధ్య వాణిజ్యానికి అనుమతి ఉన్న మార్గంలో వాహనాలు వెళుతున్న దృశ్యాలను సైనిక చొరబాటుగా చిత్రీకరించడం సరికాదు’ అని సైన్యం కొట్టిపారేసింది. రెండో వీడియోలో అరుణాచల్​లో చైనా కొన్ని ప్రాంతాలను ఆక్రమించిందని స్పియర్‌ కార్ప్స్‌ జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ గిరీశ్‌ కాలియా మాట్లాడుతున్నట్లుగా ఉంది. దీనిపై ఆర్మీ స్పందిస్తూ ‘అది ఏఐ సాయంతో రూపొందించిన డీప్‌ఫేక్‌ వీడియో. ఆ వీడియోకు ఉపయోగించిన అసలు దృశ్యాలు 2023 అక్టోబరు 27న జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో నిర్వహించిన మీడియా సమావేశానికి సంబంధించింది. నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాలపై ఆయన మాట్లాడారు. అరుణాచల్‌ప్రదేశ్​లో చైనా ఆక్రమణలు లేదా సైన్యానికి సరఫరాల నిలిపివేత గురించి ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు’ అని సైన్యం స్పష్టం చేసింది. సైన్యాన్ని కించపరిచేలా డీప్‌ఫేక్‌ వీడియోను ప్రచారం చేయడం కాంగ్రెస్‌ సైన్యంపై వ్యతిరేక వైఖరికి నిదర్శనమని భాజపా అధికార ప్రతినిధి సీఆర్‌ కేశవన్‌ విమర్శించారు. సాయుధ బలగాల గౌరవాన్ని దెబ్బతీయడంలో కాంగ్రెస్‌ పదేపదే తప్పులకు పాల్పడుతోందని ‘ఎక్స్‌’లో ఆరోపించారు.