

శ్రీనగర్: సైన్యం జరిపిన కాల్పుల్లో తగిలిన తూటా గాయాలు మానేందుకు లష్కరే తొయిబా అగ్రశ్రేణి కమాండర్ హషీమ్ మూసా ప్రాచీన ఆయుర్వేద మార్గాన్ని ఆశ్రయించాడు. జమ్మూ కశ్మీర్ అడవుల్లో నక్కిన సమయంలో పుండ్లకు స్వచ్ఛమైన తేనె పూసుకుంటూ కోలుకునే ప్రయత్నం చేశాడు. బద్గాం జిల్లా యూస్మార్గ్ ఎత్తయిన పర్వత ప్రాంతంలో భారత సైన్యం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో పాకిస్థాన్ మాజీ కమాండో అయిన ఈ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హతమయ్యాడు. 2025 పహల్గామ్ దాడి సూత్రధారుల్లో ఒకడైన మూసా, గతంలో రాజౌరీ అడవుల్లో 45 రోజుల పాటు సాగిన ఆపరేషన్ షేరువాలీ సమయంలో తీవ్ర గాయాలతో తప్పించుకున్నాడు. నలువైపులా భద్రతా బలగాలు చుట్టుముట్టడంతో ఆసుపత్రికి వెళ్లే దారి లేక అడవిలోనే తేనెతో గాయాలను నయం చేసుకునేందుకు ప్రయత్నించాడు.
ఫోన్ ఫొటోలతో బయటపడ్డ రహస్యం
యూస్మార్గ్ కొండల్లో మూసా అనుచరుడు యాసిర్ సెప్టెంబర్ మొదటి వారంలో హతమైన తర్వాత అతడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. తేనె పూసిన గాయాల చిత్రాలను సరిహద్దు దాటించి పాకిస్థాన్లోని తమ హ్యాండ్లర్లకు చేరవేసినట్లు ఆధారాలు లభించాయి. తూటాల గాయాలు త్వరగా నయమయ్యేందుకు కేవలం స్వచ్ఛమైన తేనె మాత్రమే వాడాలని పాక్ సూత్రధారులు సూచనలు ఇచ్చినట్లు నిర్ధారణ అయింది. దాదాపు 12 ఉగ్రవాద దాడుల్లో ప్రమేయం ఉన్న మూసా, అడవుల్లో ప్రాణాలు దక్కించుకోవడానికి ప్రాచీన పద్ధతులపై ఆధారపడటం దర్యాప్తు అధికారులను విస్మయానికి గురిచేసింది.
సుశ్రుత సంహిత సూత్రాలతో పోలిక
గాయాలు మాన్పడంలో తేనె విశిష్ట ఔషధ గుణాలను ప్రాచీన వైద్య గ్రంథమైన సుశ్రుత సంహితలో ప్రముఖంగా ఉంటుంది. వ్రణ చికిత్స విభాగంలో దీనిని ప్రముఖంగా పేర్కొన్నారు. తేనెలోని సహజ క్రిమినాశక శక్తి, ఆమ్ల స్వభావం బాక్టీరియా వ్యాప్తిని అడ్డుకుంటాయని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆధునిక సైన్స్ సైతం తేనె సహజ నివారణ లక్షణాలను గుర్తిస్తోంది. బుల్లెట్ తగిలిన లోతైన గాయాల్లో రసాయన కణాలు మిగిలితే ఇన్ఫెక్షన్ ముప్పు తీవ్రంగా ఉంటుంది. అడవిలో లభించే తేనె వల్ల ఇతర వ్యాధులు సోకే అవకాశాలు ఉన్నా, వైద్యం అందని క్లిష్ట పరిస్థితుల్లో మూసా ఈ మార్గాన్ని అనుసరించినట్లు తెలుస్తోంది.