

కంటిని కట్టిపడేసే అద్భుత నిర్మాణం.. ఆకాశాన్ని తాకే తెల్లటి రాతి గోపురం.. లోపలికి అడుగుపెడితే రంగుల అద్దాల గుండా ప్రసరించే దివ్య కాంతి శోభ.. వెరసి మెదక్ చర్చి చూస్తే ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే! తెలంగాణ చారిత్రక, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా ఆసియాలో అతిపెద్దది, ప్రపంచంలో రెండో అతిపెద్ద చర్చిగా నిలిచిన ఈ అద్భుతమైన కట్టడం నిర్మాణం వెనుక కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు.. గొప్ప మానవతా కోణం కూడా ఉంది. కథ తెలిస్తే మాత్రం మనసు కదలక మానదు! ఆ హృదయాన్ని తాకే కథ ఏంటో తెలుసుకుందాం..
చర్చి నిర్మాణ ఆలోచన ఎలా వచ్చింది?
ఇంగ్లాండ్‌కు చెందిన చార్లెస్ వాకర్ పాస్నెట్ సువార్త సేవల కోసం 1895లో భారత్‌కు వచ్చారు. తొలుత మద్రాస్‌లో కొంతకాలం సేవలందించిన ఆయన అనంతరం సికింద్రాబాద్‌కు చేరుకున్నారు. 1897లో మెదక్‌లోని చిన్న చాపెల్ చర్చికి ప్రచారకుడిగా నియమితులయ్యారు. అప్పట్లో అక్కడి ప్రార్థనా మందిరం చాలా చిన్నగా ఉండేది. పాస్నెట్ నివాసం కోసం ఆయన అత్తామామలు మెదక్ మిషన్ కాంపౌండ్‌లో రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించి ఇచ్చారు. చిన్నగా ఉన్న చాపెల్ చర్చి కంటే తన నివాస భవనం పెద్దగా ఉండటం పాస్నెట్‌కు నచ్చలేదు. భవిష్యత్తులో నిర్మించబోయే చర్చి తన నివాస భవనం కంటే మరింత ఎత్తుగా, విశాలంగా ఉండాలని ఆయన భావించారు. ఈ ఆలోచనను తన మిత్రుడు బ్రాడ్‌షాతో పంచుకున్నారు. ఇద్దరూ కలిసి చర్చి కోసం అనేక నమూనాలను పరిశీలించి, సుమారు 200 డిజైన్లను రూపొందించినట్లు చెబుతారు. వాటిలో పాస్నెట్‌కు నచ్చిన నమూనానే చివరకు మెదక్ చర్చి నిర్మాణానికి ఎంపికైంది.
చర్చి నిర్మాణంతో వేలాది కుటుంబాలకు ఉపాధి!
మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం.. ఓవైపు యుద్ధ ప్రభావం.. మరోవైపు కరువు కాటకం.. తినడానికి తిండి లేక.. చేతిలో పని లేక.. ప్రజలు ఆకలితో నకనకలాడుతున్న రోజులు. పట్టెడన్నం దొరికితే చాలు.. అదే మహాభాగ్యంగా భావించే దుర్భర పరిస్థితులు.. 1908లో మెదక్ ప్రాంతంలో తీవ్ర కరువు వచ్చింది. వర్షాలు లేక పంటలు సాగుచేసే పరిస్థితి లేదు. పనులు లేక ఉపాధి కరువైంది. వేలాది మంది ప్రజలు ఆకలి దప్పులతో అలమటించారు. తీవ్రమైన కరువు, దుర్భిక్ష పరిస్థితులతో మెదక్ ప్రాంతం అల్లాడుతున్న సమయంలో చర్చి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆకలితో అలమటిస్తూ, చేతిలో పని లేక ఇబ్బందులు పడుతున్న వేలాది మంది పేదలకు ఈ నిర్మాణం ఓ ఉపాధి మార్గంగా మారింది. ఆ సమయంలో బర్మా దేశం నుంచి బియ్యంతోపాటు ఇతర ఆహార పదార్థాలు తెప్పించి పనికి ఆహారం ప్రతిపాదికన ఈ చర్చిని నిర్మాణం చేపట్టారు. 1914లో ప్రారంభమైన చర్చి నిర్మాణ పనులు 1924 వరకు సాగాయి. అంటే పదేళ్ల పాటు సాగిన చర్చి నిర్మాణం వల్ల సుమారు 12 వేల మంది ఉపాధి పొందారు. అలా ఓ ప్రార్థనా మందిర నిర్మాణం కేవలం ఒక ఆధ్యాత్మిక కట్టడాన్ని సృష్టించలేదు.. కరువు సమయంలో ఎన్నో కుటుంబాలకు అన్నం పెట్టింది.. ఉపాధి కల్పించింది.. ఆశను నింపింది. అందుకే మెదక్ చర్చి చరిత్రలో దాని నిర్మాణం వెనుక ఉన్న ఈ మానవతా కోణం ప్రత్యేకంగా గుర్తుండిపోయింది.
క్రిస్మస్ రోజున ప్రారంభం.. అద్దాల్లో ఏసు జీవిత కథ!
కరువు కాలంలో వేలాది మందికి ఉపాధి కల్పించిన ఈ మహా ప్రార్థనా మందిరం నిర్మాణం పూర్తయ్యాక.. 1924లో క్రిస్మస్ పర్వదినాన మెదక్ చర్చి ప్రారంభోత్సవం జరిగింది. భారతీయ, విదేశీ కళానైపుణ్యాల సమ్మేళనంగా రూపుదిద్దుకున్న ఈ చర్చి నాటి నుంచే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విశాలమైన ప్రాంగణం, ఎత్తైన గోపురం, అద్భుతమైన అంతర్గత అలంకరణలు సందర్శకులను ఆకట్టుకుంటాయి.
ఈ విశాలమైన ప్రార్థనా మందిరం లోపల ఒకేసారి సుమారు 5,000 మంది భక్తులు ప్రార్థనలు చేసుకునేంత సామర్థ్యం ఉంది. మైక్‌లు, స్పీకర్లు లేని ఆ కాలంలోనే నిర్మించినప్పటికీ, ప్రసంగ పీఠం (Pulpit) వద్ద మాట్లాడే మాటలు చర్చి చివరి వరుసలో కూర్చున్న వ్యక్తికి కూడా చాలా స్పష్టంగా వినిపించేలా శబ్ద తరంగాల సాంకేతికతతో దీని ఫ్లోరింగ్, సీలింగ్ డిజైన్ చేశారు. ఇనుము వాడని శతాబ్దపు కట్టడం: ఈ చర్చి నిర్మాణంలో ఎక్కడా ఇనుప కడ్డీలు (Iron rods) ఉపయోగించలేదు. కేవలం రాళ్లు, ప్రత్యేకంగా తయారు చేసిన సున్నం మిశ్రమంతోనే వందేళ్లు దాటినా చెక్కుచెదరకుండా నిర్మించారు.
అయితే చర్చిలోని రంగురంగుల స్టెయిన్డ్ గ్లాస్ కిటికీలు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. లండన్‌కు చెందిన కళాకారుడు సాలిస్ రూపొందించిన ఈ అద్దాల్లో ఏసుక్రీస్తు జీవితంలోని ప్రధాన ఘట్టాలను అందంగా ఆవిష్కరించారు. బయట నుంచి సూర్యకాంతి అద్దాలపై పడినప్పుడు మాత్రమే ఆయా దృశ్యాలు మరింత స్పష్టంగా కనిపించడం వీటి ప్రత్యేకత. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యకాంతి మారుతున్న కొద్దీ కిటికీలపై కనిపించే దృశ్యాలు కూడా భిన్నమైన అనుభూతిని కలిగిస్తాయి.
చర్చి అంతర్భాగంలోనూ వివిధ దేశాల కళానైపుణ్యాల ముద్ర కనిపిస్తుంది. చెకోస్లోవేకియాకు చెందిన కళాకారులు దేవదారు కలపతో రూపొందించిన బైబిల్ పఠన వేదిక, రంగూన్ టేకుతో చేసిన ప్రభుభోజన బల్ల, రోజ్‌వుడ్‌తో రూపొందించిన కుర్చీలు, టేబుళ్లు, తలుపులు చర్చి వైభవాన్ని మరింత పెంచుతున్నాయి. ఇలా ప్రార్థన, కళ, చరిత్ర, మానవతా విలువలు అన్నీ కలగలిసిన అరుదైన వారసత్వ కట్టడంగా మెదక్ చర్చి నిలిచిపోయింది.
చర్చి వల్లే ‘మెదక్’కు ఆ పేరు వచ్చింది !
మెదక్ అనే పేరు వెనుక కూడా ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని ‘గుల్షనాబాద్’ అని పిలిచేవారని చెబుతారు. చర్చి నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో కరువు బాధితులు, పేదలు పెద్ద సంఖ్యలో పనుల కోసం అక్కడికి తరలివెళ్లేవారట. వారిని ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే.. ‘మెతుకు కోసం పనికి వెళ్తున్నాం’ అని చెప్పేవారని స్థానిక కథనం. క్రమంగా ఈ ప్రాంతాన్ని ‘మెతుకు సీమ’గా పిలవడం మొదలైందని, అదే కాలక్రమంలో ‘మెతుకు’ నుంచి ‘మెదక్’గా రూపాంతరం చెందిందని ఓ ప్రచారం ఉంది.