

న్యూఢిల్లీ: లద్దాఖ్ భారత్‌లో అంతర్భాగమేనని భారత్ మరోమారు స్పష్టం చేసింది. దీనిని ఎవరైనా తిరస్కరించినంత మాత్రాన ఈ వాస్తవం మారదని విదేశాంగ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 2న లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని 28 వ్యూహాత్మక ప్రాంతాలు, భౌగోళిక ప్రదేశాలను భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఈ ప్రాంతాలను అధికారికంగా గుర్తించడం ద్వారా మ్యాప్‌లో స్పష్టత తీసుకురావడంతో పాటు, సరిహద్దు ప్రాంతాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడమే లక్ష్యమని విదేశాంగ శాఖ తాజాగా వెల్లడించింది. అలిషా గిరి, బ్రాంగ్సా, చాప్చిగల్ పాస్, కనిష్క, కరుణ్ పిర్, కుక్సెల్, మార్తాండ గిరి, పర్పిక్, స్కామిర్ గ్లేసియర్లు, షాచ్మిరిక్ పాస్, ష్కోర్గా లోయ, జార్వార్, డెహ్రా కంపాస్, ద్రాక్ కర్పొ, జల్మోరి, కుమారయాన పాయింట్, పాంగ్లుంగ్, రించెన్ జాంగ్పో, సక్యాశ్రి గిరి, గురు రిన్‌పోచె, షామాల్ లుంగ్పా, యాంగ్పా నది, మార్పా లోట్సావా రీ, మిలారేపా కాంగ్రా, శివా రీ, మహేశ్వర రీ ప్రాంతాల పేర్లతో అక్టోబర్ 2న భారత్ ఓ జాబితా విడుదల చేసింది. దీంట్లో 2020లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న గాగ్రా, హాట్ స్రింగ్ కీలక ప్రాంతాలున్నాయి. కాగా, భారత్ ఈ ప్రాంతాలకు అధికారికంగా పేర్లు ఖరారు చేస్తూ, మ్యాప్ విడుదల చేయటంపై చైనా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. భారత్ తీసుకున్న నిర్ణయంపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాన్ని చైనా గుర్తించదని, భారత్ ప్రకటించిన కొత్త పేర్లు చట్టబద్ధమైనవి కావని పేర్కొన్నారు. పశ్చిమ సరిహద్దు ప్రాంతంలోని సంబంధిత భూభాగాలు చైనాకు చెందినవేనని ఆ దేశం వాదించింది. అయితే ఈ వాదనను భారత్ తోసిపుచ్చింది. భారత్, చైనా మధ్య సుమారు 3,500 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతోంది. కీలక ప్రాంతాల్లో భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఇరు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.