సబర్మతిపై బుల్లెట్ వంతెన

12 అంతస్థుల భవనమంత ఎత్తులో ఇంజినీరింగ్ అద్భుతం
Mumbai Ahmedabad bullet train over Sabarmati bridge
Mumbai Ahmedabad bullet train over Sabarmati bridge
Published on: 

అహ్మదాబాద్: దేశ ప్రతిష్ఠాత్మక ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ (బుల్లెట్ రైలు) ప్రాజెక్టులో కీలక అడుగు పడింది. గుజరాత్‌లోని సబర్మతి నదిపై నిర్మిస్తున్న 480 మీటర్ల భారీ వంతెన పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. సబర్మతి, అహ్మదాబాద్ స్టేషన్ల మధ్య ఏర్పాటైన ఈ నిర్మాణం సుమారు 36 మీటర్ల (118 అడుగులు) ఎత్తును కలిగి ఉంది. దాదాపు 12 అంతస్తుల భవనమంత ఎత్తుతో రూపుదిద్దుకోవడం ఈ వంతెన ప్రత్యేకత.

అధునాతన సాంకేతిక పరిజ్ఞానం

సబర్మతి వంతెన నిర్మాణంలో ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్ అత్యాధునిక ఇంజినీరింగ్ విధానాలను అమలు చేసింది. పశ్చిమ రైల్వే ప్రధాన మార్గానికి సమాంతరంగా సాగే ఈ వంతెన పిల్లర్లను క్లియరెన్స్‌ల దృష్ట్యా భారీ ఎత్తుతో డిజైన్ చేశారు. నీటి సహజ ప్రవాహానికి ఆటంకం కలగకుండా మొత్తం 8 పిల్లర్లలో 4 మాత్రమే నదీ గర్భంలో ఏర్పాటు చేశారు. నదిపై సాధారణ తాత్కాలిక సపోర్టులు వాడకుండా 'బ్యాలెన్స్‌‌డ్ కాంటిలీవర్' పద్ధతిలో సెగ్మెంట్లను అనుసంధానించారు. పిల్లర్ల సంఖ్య తగ్గించేందుకు 50 నుంచి 76 మీటర్ల పొడవైన స్పాన్లను అమర్చారు.

గుజరాత్‌లో 18 వంతెనలు పూర్తి

ముంబై-అహ్మదాబాద్ 508 కిలోమీటర్ల బుల్లెట్ రైలు కారిడార్‌లో మొత్తం 25 నదీ వంతెనలను ప్రతిపాదించారు. వీటిలో మహారాష్ట్ర పరిధిలో 4, గుజరాత్ పరిధిలో 21 వంతెనలు ఉన్నాయి. తాజా సబర్మతి వంతెన పూర్తి కావడంతో గుజరాత్ రాష్ట్రంలో పూర్తయిన నదీ వంతెనల సంఖ్య 18కి చేరింది. మిగిలిన 3 వంతెనల పనులు శరవేగంగా సాగుతున్నాయని, నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు.