అర్ధరాత్రే అంత్యక్రియలు ఎందుకు ?

Nana Patekar
Nana Patekar
Published on: 
  • మీడియాకు నానా పాటేకర్​ కుమారుడి సమాధానమిదీ

  • డోంజే గ్రామంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

  • హాజరైన సీఎం ఫడ్నవిస్​, డిప్యూటీ సీఎం షిండే

పుణె (మహారాష్ట్ర): బాలీవుడ్​ దిగ్గజ నటుడు నానా పాటేకర్​ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ భౌతిక భవబంధాలను  వదిలి పంచభూతాలలో మమేకమయ్యారు. గురువారం అర్ధరాత్రి మహారాష్ట్రలోని పుణె శివారులోని డోంజే గ్రామంలో ఉన్న సొంత వ్యవసాయ క్షేత్రంలో పాటేకర్​ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, డిప్యూటీ సీఎం ఏక్​నాథ్​ షిండే సహా సినీ ప్రముఖులు, వేలాది అభిమానుల సమక్షంలో రాత్రి 11:30 గంటలకు పాటేకర్​ పార్థివ దేహానికి ఆయన కుమారుడు మల్హర్ చితి అంటించారు.

అందుకే రాత్రికల్లా అంత్యక్రియలు

నానా పాటేకర్ గుండెపోటుతో గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అయితే ఆయన అంత్యక్రియలను హుటాహుటిన అదే రోజు రాత్రే ఎందుకు నిర్వహించారు ? అని మీడియా అడిగిన ప్రశ్నకు నానా పాటేకర్​ కుమారుడు మల్హర్ పాటేకర్ సమాధానమిచ్చారు. ‘‘మా నాన్నగారు గోవాలో చనిపోయారు. చివరి కోరిక మేరకు, ఆయన పార్థివ దేహాన్ని అక్కడి నుంచి మహారాష్ట్రలోని డోంజే గ్రామంలో ఉన్న వ్యవసాయ క్షేత్రానికి తీసుకొచ్చాం. మేం అనుకున్న దాని కంటే ఆలస్యంగా భౌతికకాయం డోంజే గ్రామానికి చేరింది. గురువారం తెల్లవారుజామునే మా నాన్న కన్నుమూశారు. రాత్రికల్లా చాలా సమయం గడిచిపోయింది. అందుకే మేం వెంటనే అంత్యక్రియలను నిర్వహించాలని నిర్ణయించాం” అని మల్హర్ పాటేకర్​ వివరించారు.

సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం

నానా పాటేకర్​ అంత్యక్రియలు పూర్తవగానే మీడియాతో మల్హర్​ పాటేకర్​ మాట్లాడారు. ‘‘మా నాన్న చేసిన పనులు ఆయన్ను అమరుడిగా మార్చాయి. ప్రత్యేకించి నామ్​ ఫౌండేషన్​ ద్వారా నాన్న చేసిన సేవా కార్యక్రమాలను ఇకపైనా మేం కొనసాగిస్తాం. మానవత్వం, ప్రపంచ ఉన్నతికి పాటుపడదామని నాన్న పదేపదే చెబుతుండేవారు. నామ్​ ఫౌండేషన్​ ద్వారా కశ్మీరులోనూ విద్య, ఆరోగ్య సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. జలరంగంపైనా మేం ఫోకస్​ పెట్టాం. ఈ లోకాన్ని వీడటానికి ముందే ఎవరి బాధ్యతలను వారికి నాన్నగారు కేటాయించారు” అని మల్హర్​ పేర్కొన్నారు.