

2047కల్లా వికసిత్ భారత్: ప్రధాని నరేంద్ర మోదీ
ప్రభుత్వ బాధ్యతల్లో 25 ఏళ్లు పూర్తిచేసుకున్న ప్రధాని
న్యూఢిల్లీ: ఈ దేశం తనకు ఎంతో ఇంత ఇచ్చిందని, ప్రజలే తనకు దేవుళ్లని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని తెలిపారు. ప్రభుత్వ బాధ్యతల్లో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సీఎంలు, పలువురు నేతల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. బుధవారం న్యూఢిల్లీలో ఏర్పాటుచేసిన ‘వికసిత్ భారత్ సంకల్ప’ సభలో ప్రధాని మోదీ తన రాజకీయ ప్రయాణం, నేర్చుకున్న పాఠాల గురించి మాట్లాడారు. దేశ ప్రజల నమ్మకాన్ని మరింత బాధ్యతగా భావిస్తూ ముందుకు సాగుతానని చెప్పారు. ఇన్నేండ్ల తన రాజకీయ ప్రయాణంలో విమర్శకులు, రాజకీయ ప్రత్యర్థులే ప్రజాస్వామ్య బలం ఏంటో తనకు నేర్పారని అన్నారు. ‘నన్ను వ్యతిరేకించిన వారి వల్ల ప్రజాస్వామ్యం ఎంత శక్తిమంతమైనదో తెలుసుకున్నా. విమర్శకుల వల్ల ఆత్మపరిశీలన చేసుకున్నా’ అని తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకమే తన బాధ్యతకు కారణమని, ఇప్పటికీ తనని తాను విద్యార్థిగానే భావిస్తున్నట్టు పేర్కొన్నారు. తానూ చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలనే ఆసక్తితో ఉండేవాడినని మోదీ గుర్తు చేసుకున్నారు. తరగతి గదికి అందరికంటే ముందుగా వెళ్లే విద్యార్థుల్లో తాను ఒకడినని చెప్పారు. మోదీ తొలిసారిగా 2001 అక్టోబర్‌లో గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2014 మేలో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి దేశ ప్రధానిగా కొనసాగుతున్నారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని పలువురు సీఎంలు, బీజేపీ నాయకులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. 25 ఏళ్లుగా ప్రభుత్వ పదవిలో కొనసాగటం అసాధారణ ప్రయాణమని దేశవ్యాప్తంగా పలువురు నేతలు ప్రధాని సేవల్ని కొనియాడారు.