

– ఈశాన్య రుతుపవనాలపై దక్షిణాది గంపెడాశలు
– నిరాశను మిగిల్చిన ‘నైరుతి’ వానలు
– వానకాలంలో కరువు ఛాయలు
– రబీలో సాధారణ వర్షపాతం: వాతావరణశాఖ
న్యూఢిల్లీ: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిరాశను మిగిల్చాయి. వానకాలంలో కరువుఛాయలు అలుముకున్నాయి. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పడలేదు. సాగునీటికి, తాగునీటికి సైతం ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాలు ఈశాన్య రుతుపవనాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడితే.. వానకాలం నష్టాన్ని యాసంగితో పూడ్చుకోవాలని అన్నదాతలు వేచి చూస్తున్నారు. వాతావరణశాఖ సైతం ఈ సారి నైరుతి రుతుపవనాల ప్రభావంతో సాధారణ వర్షాలు పడతాయని చెబుతున్నది. ఈ అంచనా ప్రకారం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు కురుస్తాయా? దక్షిణాది కరువును తీరుస్తాయా? అన్నది వేచి చూడాలి.
ఖరీఫ్‌లో లోటు వర్షపాతం
ఖరీఫ్ సీజన్లో ఏపీ , తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సాధారణం కంటే 24.3 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. 2026లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా 759.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది దీర్ఘకాల సగటు కంటే 13 శాతం తక్కువని వాతావరణశాఖ చెబుతున్నది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వర్షపాతం దీర్ఘకాల సగటులో 87 శాతంగా నమోదైంది. దక్షిణ భారతదేశంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులో 542 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇది దీర్ఘకాల సగటులో 76 శాతం. అంటే సాధారణంగా కురవాల్సిన వర్షాలకంటే నాలుగో వంతు తక్కువ నమోదైంది.
ఖరీఫ్ సాగుపై ప్రభావం
దేశవ్యాప్తంగా ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం అక్టోబర్2 నాటికి 111.5 మిలియన్ హెక్టార్లుగా ఉంది. గతేడాది ఇదే సమయానికి 112.7 మిలియన్ హెక్టార్లలో రైతులు సాగు చేశారు. అంటే ఈ ఏడాది 1.2 మిలియన్ హెక్టార్ల మేర సాగు తగ్గింది. సాధారణంగా ఖరీఫ్‌లో సాగు చేసే 110.4 మిలియన్ హెక్టార్లతో పోలిస్తే ఈ ఏడాది సాగు విస్తీర్ణం ఇంకా ఎక్కువగానే ఉంది. పంటల వారీగా చూస్తే వరి సాగు ఎక్కువగా తగ్గింది. గతేడాది 44.9 మిలియన్ హెక్టార్లలో వరి సాగు చేయగా.. ఈ ఏడాది 43.4 మిలియన్ హెక్టార్లకు తగ్గింది. పత్తి సాగు కూడా 11.1 మిలియన్ హెక్టార్ల నుంచి 11.05 మిలియన్ హెక్టార్లకు తగ్గింది. మరోవైపు పప్పుధాన్యాల సాగు 12.2 మిలియన్ హెక్టార్లకు, నూనెగింజల సాగు 19.6 మిలియన్ హెక్టార్లకు స్వల్పంగా పెరిగిందని వ్యవసాయశాఖ చెబుతున్నది.
జలాశయాల్లో తగ్గిన నీటి నిల్వలు
వర్షాల లోటు ప్రభావం జలాశయాలపైనా కనిపించింది. అక్టోబర్ 1 నాటికి దేశంలోని చాలా ప్రాంతాల్లో గతేడాదితో పోలిస్తే జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దక్షిణ భారత జలాశయాలు ప్రస్తుతం వాటి మొత్తం సామర్థ్యంలో 49.15 శాతం మాత్రమే నిండాయి. గతేడాది ఇదే సమయానికి 87.82 శాతం నీరు ఉండేది. సాధారణ స్థాయి 76.28 శాతంగా ఉంది. అంటే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దక్షిణ భారత జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి.
ఈశాన్య రుతుపవనాలు ఎలా ఉండబోతున్నాయి?
దక్షిణ భారతదేశంలో ఈశాన్య రుతుపవనాల సీజన్లో సాధారణ స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. దీర్ఘకాల సగటు వర్షపాతంలో 88 నుంచి 112 శాతం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దేశంలోని చాలా ఇతర ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ పేర్కొన్నది . “భూమధ్యరేఖకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం బలమైన ఎల్ నినో పరిస్థితులు కొనసాగుతున్నాయి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏడాది చివరి వరకు ఎల్ నినో బలపడుతుంది” అని భారత వాతావరణశాఖ వాతావరణ శాస్త్ర విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర పేర్కొన్నారు.
ఉత్తరభారతదేశంలోనూ వానలు
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో అక్టోబర్ 15 వరకు ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతున్నది. పంజాబ్, హరియాణా, ఉత్తర రాజస్థాన్, ఢిల్లీతో పాటు యూపీ, బిహార్‌లో వర్షాలు పడనున్నాయి. ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో పొడి, వేడి వాతావరణం కొనసాగనుంది. దక్షిణ భారతదేశంలో కర్ణాటక, కేరళ, తమిళనాడులో వర్షాలు కొనసాగినా తీవ్రత కొంత తగ్గనుంది. ప్రస్తుత వర్షాలు రబీ పంటల సాగుకు ముందు నేలలో తేమ పెరగడానికి ఉపయోగపడతాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు అక్టోబర్ 15 నాటికి పూర్తిగా వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత దక్షిణ భారతదేశానికి ప్రధాన వర్షాలను అందించే ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం కానున్నాయి.