

పాట్నా: ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 20న బీహార్‌లో పర్యటించనున్నారు. భాగల్‌పూర్ జిల్లా కహల్‌గావ్‌లో విక్రమశిల సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నట్లు బీజేపీ నేతలు బుధవారం వెల్లడించారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రధాని బీహార్‌లో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నవంబర్‌లో ప్రధాని బీహార్ పర్యటన ఖరారైందని, అధికారికంగా ధృవీకరించాల్సి ఉందని బీజేపీ మీడియా ఇన్‌చార్జ్ డానిష్ ఇక్బాల్ తెలిపారు. కహల్‌గావ్‌లోని అంతిచాక్ వద్ద గల పురాతన బౌద్ధ విజ్ఞాన కేంద్రం(విక్రమశిల) సమీపంలో కొత్త సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. పాల సామ్రాజ్య కాలం(9వ శతాబ్దం)లో ఈ పురాతన అభ్యసన కేంద్రం ఏర్పాటైంది. ఈ ప్రాజెక్టు కోసం అంతిచాక్, మలక్‌పూర్ ప్రాంతాల్లో 205 ఎకరాల భూమిని బీహార్ ప్రభుత్వం కేటాయించింది. విక్రమశిల కీర్తిని పునరుద్ధరించేందుకు కృషి చేస్తామని బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి జూన్‌లో ప్రకటించారు. దీంతోపాటు ప్రధాని గోరఖ్‌పూర్-సిలిగురి, రక్సాల్-హల్దియా, పాట్నా-పూర్ణియా రోడ్డు కారిడార్లు, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రైల్వే ప్రాజెక్టులు, కచ్చి దర్గా-బిదుపూర్ రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.