గాయపడ్డా ప్రయాణికులు చనిపోకుండా కాపాడాను

కళ్లు మూసుకుపోతుంటే హనుమాన్ చాలీసా పఠనం చేసా
PM Modi Video Call Captain Smith Machar
Published on: 

న్యూఢిల్లీ: ఆసుపత్రి బెడ్‌పై చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం 10 నిముషాల పాటు వీడియో కాల్ మాట్లాడారు. స్మిత్ ప్రదర్శించిన అసాధారణ ధైర్యం, సమయస్ఫూర్తిని ప్రధాని మనస్ఫూర్తిగా కొనియాడారు. తీవ్ర గాయాలపాలై, చావుతో పోరాడుతున్నా తన ప్రాణాల గురించి ఆలోచించకుండా ప్రయాణికుల రక్షణకే ప్రాధాన్యమిచ్చారని ప్రశంసించారు. స్మిత్ సాహసం 140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిందని ప్రధాని పేర్కొన్నారు. దీనిపై కెప్టెన్ స్మిత్ స్పందిస్తూ, తోటి ప్రయాణికులను కాపాడటంలో సిబ్బంది, ప్యాసింజర్లు సమాన పాత్ర పోషించారని భావోద్వేగానికి లోనయ్యారు.

గాయపడ్డాను.. ప్రాణాలు కాపాడాను

నేను తీవ్రంగా గాయపడ్డాను..శరీరంపై ఎన్నో గాయాలయ్యాయి.. చివరి వరకూ ప్రయాణికులు చనిపోకుండా కాపాడేందుకే ప్రయత్నం చేసానని ప్రధాని మోదీతో అన్నారు కెప్టెన్ స్మిత్ మచ్చార్. జరిగిన ఘటనను వివరిస్తూ..‘గాయాలతో కింద పడిపోయాక కళ్లు చీకట్లు కమ్ముకుంటున్నాయి.. ఈ క్షణం నేనేమీ చేయకపోతే విమానంలోని వారందరూ చనిపోతారు.. నేను గత 17 సంవత్సరాలుగా విమానాలు నడుపుతూ కెప్టెన్‌గా సేవలందిస్తున్నాను. విమానంలో ఉన్నప్పుడు కళ్లు మూసుకున్నా నా చుట్టూ ఏం జరుగుతోందో నాకు తెలుస్తుంది. నాకు తెలుసు విమానం నోస్ డ్రైవ్ చేస్తోంది. తాను ఏదో ఒకటి చేయకపోతే అందరూ ప్రాణాలు కోల్పోతారని తెలుసు అందుకే కొనఊపిరితోనే కష్టపడి కాక్‌పిట్ తలుపులు తెరిచారు. పట్టు లభించకున్నా ఎలాగోలా కాక్‌పిట్ తలుపు తెరిచా..అరుపులు విన్న క్యాబిన్ సిబ్బంది, ప్రయాణికులు వెంటనే కాక్‌పిట్‌లోకి చొచ్చుకు వచ్చి ఉన్మాద కో-పైలట్‌ను నిలువరించారు. అక్కడ ప్రతీ ఒక్కరూ తమ వంత పాత్ర పోషించారు అందుకే అందరి ప్రాణాలు దక్కాయి.

హనుమాన్ చాలిసా పఠనం చేసాను

నాకు భయం వేసినప్పుడు హనుమాన్ చాలీసా పఠనం చేస్తాను. కాక్‌పిట్ ఘటన సమయంలో నాపై నిర్దాక్షిణ్యంగా దాడి జరుగుతున్నప్పుడు కూడా అదే చేసాను. నాకు తెలుసు.. దేవుడు నన్ను రక్షిస్తాడు అని నా నమ్మకం. నా రెండేళ్ల కుమారుడికి కూడా ప్రతీ రోజు ఉదయం హనుమాన్ చాలీసా పఠించేలా చేస్తాను.. నా దేశానికి దూరంగా ఉన్నా నా సంస్కృతిని, సంప్రదాయాలను మరచిపోలేదని గుజరాత్ రాష్ట్రవాసి అయిన కెప్టెన్ స్మిత్ మచ్చార్.

గాల్లో క్షణక్షణం భయం భయం

దుబాయ్-టెల్ అవీవ్ మార్గంలో ప్రయాణిస్తున్న ఫ్లయ్‌దుబాయ్ బోయింగ్ 737 విమానంలో ఈ దారుణం చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా ఒమన్ దేశస్థుడైన కో-పైలట్ హఠాత్తుగా పైలట్ స్మిత్ మచ్ఛార్‌పై విమానంలో ఉండే గొడ్డలి లాంటి పరికరంతో విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం కాలుతో తన్నుతూ కంట్రోల్స్ విరగ్గొట్టాడు. విమానాన్ని వేగంగా కిందికి కూల్చివేసే ప్రయత్నం చేశాడు. కేవలం 30 సెకన్ల వ్యవధిలో విమానం సుమారు 14,000 అడుగుల మేర ఒక్కసారిగా కిందకు దిగిపోయింది. ఒళ్లంతా తీవ్ర గాయాలవుతున్నా, రక్తం కారుతున్నా కెప్టెన్ స్మిత్ మాత్రం గుండెధైర్యం కోల్పోలేదు. చావుబతుకుల మధ్య పోరాడుతూనే విమానంలోని ప్రయాణీకుల ప్రాణాలను కాపాడి రియల్ హీరోగా నిలిచారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు పైలట్లు చాకచక్యంగా విమానాన్ని నియంత్రించి సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు.