

ఈసీ తీరుపై బెంగళూరులో సీజేపీ నిరసన
ఓటర్ జాబితా సవరణపై ఆగ్రహం
ఎన్నికల సంఘంపై అభిజిత్ దీప్కే, ప్రకాశ్ రాజ్ ఫైర్
ఓటు హక్కు కోల్పోయిన బాధితుల ఆవేదన
ప్రభాత ఉదయం : బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ వేదికగా ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర నిరసన వెల్లువెత్తింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్, యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఈ ఆందోళనకు నాయకత్వం వహించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ గళం విప్పారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో చోటుచేసుకున్న అవకతవకలపై మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్న ఈ చర్యలను తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.
రాజీనామా చేయాల్సిందే: అభిజీత్ దీప్కే
ఈ నిరసన సభలో ప్రధాని నరేంద్ర మోదీపై అభిజీత్ దీప్కే ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషనర్ పదవికి రాజీనామా చేసేవరకు నిరసన ఆపేది లేదని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కింద ఓట్లను తొలగిస్తూ బీజేపీ వ్యతిరేకులను ఓటు హక్కుకు దూరం చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్ రాజీనామా చేసేవరకు రోడ్లపైకి వచ్చి పోరాటం కొనసాగిస్తామని దీప్కే హెచ్చరించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలి: ప్రకాశ్ రాజ్
ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలని ప్రకాశ్ రాజ్ డిమాండ్ చేశారు. ఇది కేవలం ఓట్ల తొలగింపు మాత్రమే కాదని, పౌరుల ఆత్మగౌరవంపై జరుగుతున్న తీవ్రమైన దాడి అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకే ఎన్నికల కమిషనర్ పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రతి ఐదేళ్లకోసారి ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులు ఇప్పుడు ప్రజలను తమ ఓట్లు కాపాడుకోవడానికి రోడ్లెక్కి పోరాడేలా చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘ఓట్ చోర్, గద్దీ చోర్’ అంటూ నినాదాలు చేశారు. ఎస్ఐఆర్ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనులు, పేదలు, ముస్లింలు ఇతర మైనారిటీల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. ఎస్ఐఆర్ను పూర్తిగా వెనక్కి తీసుకునే వరకు శాంతియుతంగా ఉద్యమం సాగుతుందని తెలిపారు. కర్ణాటక అంతటా పర్యటించి ఓట్లు కోల్పోయిన బాధితుల కన్నీటి గాథలను స్వయంగా చూశామని ప్రకాశ్ రాజ్ చెప్పారు.
పారదర్శకత లేదు: ధృవ్ రాఠీ
ఈ నిరసనలో ఫేమస్ యూట్యూబర్ ధృవ్ రాఠీ కూడా మాట్లాడారు. ఎస్ఐఆర్ విషయంలో ఎన్నికల సంఘం వ్యవహార శైలిలో పారదర్శకత లేదని ఆయన ఆరోపించారు. ఈ ప్రక్రియలో జవాబుదారీతనం పూర్తిగా కొరవడిందని మండిపడ్డారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కారణం లేకుండా ఓట్ల తొలగింపు
ఈ నిరసనలో బెంగళూరు నగర వాసులు, విద్యార్థులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఓటర్ జాబితా నుంచి తమ పేర్లను కారణం లేకుండా తొలగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫారమ్-7 దరఖాస్తుల దుర్వినియోగం ద్వారా ఓటు హక్కును కొల్లగొడుతున్నారని కొంత మంది ప్రైవేట్ ఉద్యోగులు వాపోయారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే ఈ కుట్రలను ప్రజలంతా కలిసి తిప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు.
భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ చిత్రపటాలతో నిరసనకారులు ప్రదర్శన నిర్వహించారు. ఎర్రర్ 404- నేమ్ నాట్ ఫౌండ్ వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులు అందరి దృష్టిని ఆకర్షించాయి. అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ పోరాటం నిరంతరం కొనసాగుతుందని నిర్వాహకులు ప్రకటించారు.