

ప్రభాత ఉదయం, హోషియార్‌పూర్/లూధియానా: పంజాబ్‌లో డ్రగ్స్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతున్న పర్వీందర్ సింగ్ ఝోటా దారుణహత్యకు గురికావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. మంగళవారం ఉదయం పంజాబ్‌లోని మాన్సాలోని ఓ మెడికల్ షాపులో వృద్ధుడికి మత్తు మాత్రలు విక్రయిస్తున్న వైనాన్ని ఝోటా ఫేస్‌బుక్ లైవ్‌లో నిలదీస్తుండగా, ఆ దుకాణదారుడు అశ్వినికుమార్ ఆయనపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
డ్రగ్స్ మాఫియా, మెడికల్ షాపుల్లో మత్తు పదార్థాల అక్రమ అమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న పర్వీందర్ సింగ్‌ను హత్య చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. హత్యను నిరసిస్తూ ఆయన కుటుంబ సభ్యులు, పలు రైతు సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు గురువారం ‘పంజాబ్ బంద్’కు పిలుపునిచ్చారు. హోషియార్‌పూర్, అమృత్‌సర్, ఫిరోజ్‌పూర్, జలంధర్, మాన్సా, పాటియాలా లాంటి ప్రధాన నగరాల్లో వ్యాపారులు దుకాణాలు మూసివేశారు.
లూధియానా, దాసూయా, మొహాలీ తదితర ప్రాంతాల్లో నిరసనకారులు రహదారులపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. అమృత్‌సర్‌లో కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నాయకులు సీఎం భగవంత్ మాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
పంజాబ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, డ్రగ్స్ మాఫియాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని రైతు సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడ్డాయి. సీఎం మాన్, డీజీపీ గౌరవ్ యాదవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాన్సా పోలీసు ఉన్నతాధికారులను విధుల నుంచి తొలగించి, ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశాయి.