కాలినిన్‌పై దాడి చేస్తే అణుదాడి

నాటోకు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ హెచ్చరిక
Putin Warns NATO Nuclear Strike Kaliningrad
Published on: 

మాస్కో (రష్యా): నాటో కూటమికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర హెచ్చరిక చేశారు. నాటో దేశాలు పోలాండ్, లిథువేనియా మధ్యనున్న కీలకమైన రష్యా ప్రాంతం కాలినిన్ గ్రాడ్‌పై దాడి చేస్తే, తాము అణ్వస్త్ర దాడికైనా సిద్ధమేనని ఆయన తేల్చి చెప్పారు. కాలినిన్ గ్రాడ్ రక్షణ కోసం ఎలాంటి ఆయుధ సంపత్తిని వాడేందుకైనా రెడీయేనని స్పష్టం చేశారు. రష్యా రాజధాని మాస్కోలో నిర్వహించిన వాల్దాయ్ ఫోరమ్ సమావేశంలో పుతిన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆయుధాలన్నీ మోహరిస్తాం

ఏ ఐరోపా దేశంపైనా దాడిచేసే ఆలోచన తమకు లేదని, అన్ని దేశాలతోనూ శాంతియుత సంబంధాలనే తాము కోరుకుంటున్నామని పుతిన్ చెప్పారు. కాలినిన్ గ్రాడ్‌తో పాటు రష్యాలోని అన్ని ప్రాంతాల భద్రత కోసం సకల ఆయుధ సంపత్తిని మోహరిస్తున్నామని ఆయన తెలిపారు. రష్యా రక్షణ కోసం ఇలాంటి ఏర్పాట్లు చేయక తప్పదన్నారు. రష్యా కంటే నాటో కూటమి దేశాల విస్తీర్ణం రెట్టింపు ఉంటుందని, ఈ పరిస్థితుల్లో ఆ దేశాలను ప్రతిఘటించేందుకు ఆయుధ శక్తిపై ఆధారపడక తప్పదని పేర్కొన్నారు. ఫ్రాన్స్, బ్రిటన్‌ దేశాల చేతిలో అణ్వస్త్రాలు ఉన్నప్పటికీ, వాటిపై పైచేయిని సాధించి పెట్టే స్థాయిలో రష్యాకూ ఆయుధ సంపత్తి ఉందని పుతిన్ వెల్లడించారు. కాలినిన్ గ్రాడ్‌ ప్రాంతాన్ని తమ దేశం నుంచి వేరు చేసేందుకు నాటో ప్రయత్నిస్తే అణ్వస్త్రాలను ప్రయోగించేందుకూ సిద్ధమని రష్యా దౌత్యవర్గాల నుంచి సందేశం అందిందని ఇటీవలే నాటో కూటమి ప్రకటించింది. ఈ నేపథ్యంలో నేరుగా నాటోకు పుతిన్ చేసిన తాజా హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది.