

న్యూఢిల్లీ: దేశంలో నిరసనలు తెలియజేస్తున్న యువత, విద్యార్థుల గొంతును అణచివేయవద్దని ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. ‘సర్’ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో గాయపడిన విద్యార్థులతో బుధవారం 10జన్‌పథ్‌లోని సోనియాగాంధీ నివాసంలో సమావేశమయ్యారు. విద్యార్థులపై పోలీసుల దాడి తీరును అడిగి తెలుసుకున్నారు. అనుచితంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకునేలా చూస్తామని వారికి హామీనిచ్చారు. యువత, విద్యార్థులకు కాంగ్రెస్ సంపూర్ణంగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిరసనలో పాల్గొన్న వారిని సింహాలతో పోల్చారు. ‘అమిత్ షాజీ.. జాగ్రత్తగా చూడండి. వీరంతా ఒక్కటిగా ఉన్నారు. ఇక్కడ ఎవరూ ముస్లిం కాదు, హిందువు కాదు. కులం లేదు, లింగ భేదం లేదు. వీరంతా ఒక్కటిగా ఉన్నారు. ఇదే హిందుస్థాన్’ అని రాహుల్ పేర్కొన్నారు. ‘ఈ దేశ యువతకు ఎదురు నిలబడవద్దని ప్రధాని, హోంమంత్రిలను కోరుతున్నాను’ అని సూచించారు. విద్యార్థులపై అనుచితంగా వ్యవహరించిన ప్రధాని, హోం మంత్రి నుంచి కానిస్టేబుళ్ల వరకు ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
చట్టానికి సమాధానం చెప్పాల్సిందే.
ప్రజాస్వామ్యంలో గొంతులను అణచివేయాలని చూస్తే చట్టం ముందు సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన గురువారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘విద్యార్థులారా.. మీపై దాడి చేసిన ప్రతి పోలీస్ అధికారి వీడియోలు జాగ్రత్తగా భద్రపరుచుకోండి.. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును హరించే అధికారం ఏ ఒక్కరికీ లేదు’ అని అందులో పేర్కొన్నారు.
అంకిత భండారి తల్లిదండ్రులను కలిసిన రాహుల్
ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నిరసనకు దిగిన అంకిత భండారి తల్లిదండ్రులను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర నేతలు కలిసి సంఘీభావం తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని ఓ రిసార్ట్‌లో ఉద్యోగిగా ఉన్న అంకితను 2022 సెప్టెంబర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఆమె అదృశ్యమైన నాలుగు రోజుల తర్వాత చిల్లా కెనాల్లో మృతదేహం లభ్యమైంది. గత ఆగస్టులో కూడా అంకిత తల్లిదండ్రులను రాహుల్ కలిశారు. తమ కూతురు మృతి చెంది నాలుగేండ్లవుతున్నా ఇప్పటివరకు న్యాయం జరగలేదని ఈ సందర్భంగా వారు రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐ వద్ద ఉన్న అంకిత కేసు తేలే వరకు సిక్కిం గవర్నర్‌గా దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను నియమించవద్దని వారు డిమాండ్ చేశారు. రిసార్ట్ యజమాని పులికిత్ ఆర్య, మాజీ బీజేపీ నేత వినోద్ ఆర్య ఈ కేసులో దోషులుగా తేలడంతో వారికి కోర్టు జీవిత ఖైదు విధించింది. కాగా, ఉత్తరాఖండ్‌లో ఇది హై ప్రొఫైల్ మర్డర్ కేసు కావడంతో సంచలనంగా మారింది.