సర్‌ పిటిషన్‌లో 14 లోపాలు.. విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

ఓటర్ల జాబితా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై రాహుల్‌ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు దాఖలు చేసిన పిటిషన్‌లో 14 లోపాలున్నందున సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది.
Rahul Gandhi
Supreme Court Refuses Rahul Gandhi INDIA Alliance SIR Voter List Petition
Published on: 

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సహా ఇండియా కూటమికి చెందిన మరో పది మంది నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషన్‌లో 14 లోపాలున్నట్లు కోర్టు రిజిస్ట్రీ గుర్తించడమే ఇందుకు కారణం. ఆ లోపాలను సరిచేసిన తర్వాత పిటిషన్‌ను విచారిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పష్టం చేశారు.

ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌లో సహ పిటిషనర్‌గా ఉన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టమైన గుర్తింపు కార్డును సమర్పించలేదని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పేర్కొంది. పిటిషన్‌లోని కొన్ని పేజీలు స్పష్టంగా లేవని, మరికొన్ని అందుబాటులో లేవని తెలిపింది. ఈ విషయాన్ని సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణన్‌ మంగళవారం సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో లోపాలను సరిచేసిన తర్వాత పిటిషన్లన్నింటినీ విచారణకు జాబితాలో చేర్చుతామని సీజేఐ స్పష్టం చేశారు.


అక్టోబర్ 12న భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం రాహుల్ గాంధీతోపాటు పదిమంది ప్రతిపక్ష నేతలు ఈ పిటిషన్ దాఖలు చేశారు. సర్ ప్రక్రియలో భాగంగా లక్షల సంఖ్యలో ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారని పిటిషనర్లు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేసి విచారించాలని డిమాండ్ చేశారు.

ఓటర్ల పేర్ల తొలగింపు, మార్పులపై నిర్దిష్ట గడువులోగా స్వతంత్ర ఆడిట్‌ నిర్వహించాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. సంబంధిత ఓటరుకు ముందస్తు నోటీసు ఇవ్వకుండా, తన వాదన వినిపించే అవకాశం కల్పించకుండా ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించకూడదని కోరారు. పంజాబ్‌తోపాటు ఎన్నికలు జరగనున్న ఇతర రాష్ట్రాల్లో అర్హులైన ఓటర్లు చట్టం అనుమతించే చివరి తేదీ వరకు జాబితాలో పేరు నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. పిటిషన్‌పై తుది నిర్ణయం వెలువడే వరకు వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న సర్‌ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కేసులో భారత ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషీలను ప్రతివాదులుగా చేర్చారు. సర్‌కు సంబంధించిన వివాదాస్పద నిర్ణయాలపై ఎన్నికల కమిషనర్లు నమోదు చేసిన పూర్తి ఫైళ్లు, సమావేశాల ఎజెండాలు, మినిట్స్‌, అభ్యంతరాలను కోర్టు ముందుంచాలని పిటిషనర్లు కోరారు.