

ప్రభాత ఉదయం, కొత్తగూడెం : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భద్రతాదళాలు మావోయిస్టుల భారీ డంప్‌ను గుర్తించాయి. డంప్‌లో భారీ మొత్తంలో రాకెట్ లాంచర్ సెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు గురువారం సాయంత్రం సంయుక్తంగా చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్‌లో భాగంగా కర్రెగుట్ట ఉసురు పోలీస్ స్టేషన్ పరిధిలోని తడపల గ్రామం వద్ద భూమిలో పాతిపెట్టిన డంపును గుర్తించారు. 711కు పైగా బారెల్ గ్రెనెడ్ రాకెట్ లాంచర్ సెల్స్‌తో పాటు భూమిలో పాతిపెట్టిన మందుపాతరలను కనుగొని, బాంబు స్క్వాడ్ సాయంతో వాటిని నిర్వీర్యం చేశారు. కర్రెగుట్టల్లో కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన బేస్ క్యాంపులకు అతి సమీపంలో వీటిని గుర్తించడం విశేషం.
ఈ ప్రాంతంలో గతంలో స్థానిక గ్రామస్తులు నివాసం ఉండేవారు. మావోయిస్టుల సంచారం పెరిగాక గ్రామస్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనితో అక్కడ మావోయిస్టులు ఆయుధాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. భద్రతా బలగాల కళ్లుగప్పి వాటిని తయారు చేసేవారు. తయారు చేసిన వాటిని డంప్‌లలో దాచడం, భూమిలో పాతిపెట్టడం చేశారు. మావోయిస్టు అగ్రనేతలకు కర్రెగుట్టలు సురక్షిత స్థావరంగా కొనసాగాయి. ఆపరేషన కగార్ దెబ్బకు మావోయిస్టులు ప్రభుత్వానికి సరెండర్ అవ్వడంతో బస్తర్ దండకారణ్యంలో మావోయిస్టుల కమిటీలు అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.
సరైండరైన మావోయిస్టుల సమాచారంతో భద్రతాబలగాలు బాంబు స్క్వాడ్ టీంలతో కలిసి అడవుల్లో దాచిపెట్టిన డంపులను వెలికితీస్తున్నారు. కర్రెగుట్టల్లో తాజాగా భారీ డంప్ బయటపడిన నేపథ్యంలో భద్రతాధికారులు స్థానిక ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. కర్రెగుట్ట కొండలు, పరిసర ప్రాంతాలకు వెళ్లకూడదని సూచించారు. అడవుల్లో పేలని ల్యాండ్ మైన్లు, ఐఈడీలు ఇంకా ఉండే ముప్పు ఉందని హెచ్చరించారు. త్వరలోనే ఈ ప్రాంతంలో ప్రత్యేక డీ మైనింగ్(బాంబుల నిర్వీర్యం) ఆపరేషన్ నిర్వహించనున్నట్లుగా తెలిపారు.