

ప్రభాత ఉదయం : వన్యప్రాణుల సంరక్షణ ఆవశ్యకతను చాటుతూ నిర్వహించిన వారోత్సవాలు గురువారంతో ముగిసిశాయి. అంతరించిపోతున్న వన్యప్రాణుల సంరక్షణ..వాటి సంఖ్యను పెంచే విషయమై వారోత్సవాల సందర్భంగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, అటవీ శాఖ ప్రత్యేకంగా అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాయి. ప్రధానంగా భారతదేశంలో అంతరించిపోతున్న జాబితాలోని వన్యప్రాణుల సంరక్షణ, సంతతి పెంపుదలకు భారతదేశపు 'సమగ్ర వన్యప్రాణుల ఆవాసాల అభివృద్ధి' పథకం కింద గుర్తించిన 24 జాతులు, వాటి ఆవాసాల సంరక్షణ పునరుద్ధరణ చర్యలపై వారోత్సవాలలో ప్రభుత్వాలు, అటవీశాఖ యంత్రాంగం, శాస్త్రవేత్తలు ప్రత్యేక దృష్టి పెట్టడం విశేషం.
వన్యప్రాణుల సంరక్షణకు జాతీయ, అంతర్జాతీయ నిధులు
ప్రపంచంలో అత్యంత తీవ్రంగా ముప్పును ఎదుర్కొంటున్న 100 జాతుల పునరుద్ధరణ కోసం అంతర్జాతీయ స్థాయిలో రీవైల్డ్, బెంజాస్ ఎర్త్ఫండ్ కలిసి 2026లో ప్రారంభించిన ఫీనిక్స్ స్పేసియస్ ప్రాజెక్టు 200 మిలియన్ డాలర్లను కేటాయించడం అరుదైన జాతుల సంరక్షణకు ప్రోత్సాహకంగా నిలిచింది. ఇదే దిశగా భారత ప్రభుత్వం, రాష్ట్రాలు కూడా ప్రత్యేక నిధులు కేటాయిస్తూ వస్తున్నాయి.
అంతరించిపోతున్న జాతుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు
తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'అంతరించిపోతున్న జాతుల పరిరక్షణ నిధి' కింద మహ్సీర్ చేప, చారల హైనా, మద్రాస్ ముళ్లపంది, సింహపు తోక కోతి, హార్న్‌బిల్ వంటి జాతుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తోంది.
మేఘాలయ రాష్ట్రం తమ రాష్ట్ర జంతువైన మచ్చల చిరుత సంరక్షణ కోసం రూపొందించిన ప్రణాళికలో ఆవాసాల పునరుద్ధరణ, పర్యవేక్షణ, స్థానిక సమాజాల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈశాన్య భారతదేశంలో 14 ప్రాధాన్య భూభాగాలను గుర్తించారు.
సత్ఫలితాలనిస్తున్న సంరక్షణ చర్యలు..
2024లో నిర్వహించిన భారతదేశపు తొలి శాస్త్రీయ అంచనాలో 718 మంచు చిరుతలు ఉన్నట్లు అంచనా వేశారు. కిబ్బర్‌లో స్థానిక మహిళలు కెమెరా ట్రాప్‌ల ఏర్పాటు, జంతువుల సంఖ్యను పర్యవేక్షించడం, వన్యప్రాణుల రక్షణలో సంరక్షణ బృందాలకు సహకరిస్తుండటం విశేషం.
తమిళనాడులోని 448.34 చదరపు కిలోమీటర్ల డుగాంగ్ సంరక్షణ రిజర్వ్ ప్రాంతం సముద్ర జీవి డుగాంగ్ సంరక్షణకు అవసరమైన సముద్రపు గడ్డి ఆవాసాల అభివృద్ధికి కేంద్రంగా నిలిచింది. 2026 అంచనా ప్రకారం పాక్ బే, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతాల్లో సుమారు 270 డుగాంగ్‌లు ఉన్నాయి. వలల్లో చిక్కుకున్న డుగాంగ్లను మత్స్యకారులు తిరిగి సముద్రంలోకి వదిలి సంరక్షణ చర్యలలో భాగస్వాములవుతున్నారు.
మణిపూర్‌కు చెందిన చిత్తడి నేల జింక సంగై భారతదేశపు జాతుల పునరుద్ధరణ కార్యక్రమంలో ప్రాధాన్య జాతిగా ఉంది. దీని మనుగడకు చిత్తడి నేలల ఆవాసాలను కాపాడటం అత్యంత కీలకంగా మారింది. కశ్మీర్‌కు చెందిన హంగుల్ జింకను భారతదేశపు జాతుల పునరుద్దరణ కార్యక్రమం ద్వారా సంరక్షిస్తున్నారు. ఆవాసాల రక్షణ, పరిశోధన, నిరంతర పర్యవేక్షణ దీని భవిష్యత్తుకు కీలకంగా నిలుస్తున్నది.
తమిళనాడు రాష్ట్ర జంతువైన నీలగిరి థార్ కోసం చేపట్టిన ప్రాజెక్టు నీలగిరి థార్‌లో సర్వేలు, రేడియో-కాలరింగ్, ఆవాసాల అంచనా వంటి చర్యలు ఉన్నాయి. 2025లో 1,303 థార్లు, 2026లో 1,364 థార్‌ల సంఖ్య నమోదుకావడం ఆశాజనకంగా కనిపిస్తున్నది.
రాబందుల పునరుద్ధరణకు వెటర్నరీ డైక్లోఫెనాక్పై నిషేధం, సంరక్షణ పెంపకం, సురక్షితమైన ఆవాసాల కల్పన వంటి చర్యలు తోడ్పడుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో 2019లో 8,397గా ఉన్న రాబందుల సంఖ్య 2025లో 12,981కు పెరిగింది. పింజోర్‌లోని సంరక్షణ కేంద్రం తెల్ల-పిరుదుల, పొడవైన-ముక్కు గల, సన్నని-ముక్కు గల రాబందుల సంరక్షణపై పనిచేస్తోంది.
గుజరాత్లో ఆసియాటిక్ సింహాల సంఖ్య 2020లో 674 నుంచి 2025లో 891కు పెరిగింది. దీర్ఘకాలిక సంరక్షణ, ఆవాసాల నిర్వహణ, స్థానిక సమాజాల భాగస్వామ్యం ఇందుకు కీలకంగా నిలిచాయి. గ్రేటర్ వన్-హార్న్డ్ రైనో గడ్డి భూముల నిర్వహణ, పర్యవేక్షణ, జంతువులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడం వంటి చర్యలు ఈ జాతి పునరుద్ధరణకు అనుకూలంగా మారాయి. అస్సాంలోని పోబిటోరాలో స్థానిక గ్రామాల ప్రజలు సింహల సంరక్షణ, మానవ–వన్యప్రాణి ఘర్షణలను తగ్గించే చర్యల్లో భాగస్వాములవుతున్నారు.
ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వ కార్యక్రమాలలో చిత్తశుద్ధి, శాస్త్రీయ పరిశోధనలు సమన్వయంతో కొనసాగాలని పరిశోధకులు కోరుతున్నారు. తద్వారానే అంతరించిపోతున్న వన్యప్రాణుల పునరుద్ధరణ లక్ష్య సాధన విజయవంతమవ్వనుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.