

కొన్ని చరిత్రలు పుస్తకాల్లో ఉంటాయి. మరికొన్ని ఫొటోల్లో, ఉత్తరాల్లో దాగుంటాయి. ఇంకొన్ని మాత్రం మనుషుల జ్ఞాపకాల్లో.. వాళ్ల కదలికల్లో బతికే ఉంటాయి. అలాంటి అరుదైన నృత్య వారసత్వమే ఝవేరీ సోదరీమణులది. మణిపురి నృత్యాన్ని దేవాలయాల నుంచి ప్రపంచ వేదికల దాకా తీసుకెళ్లిన నయనా, రంజనా, సువర్ణ, దర్షనా ఝవేరీల కళా ప్రయాణం ఇప్పుడు మరోసారి చర్చలోకి వచ్చింది.
1927లో జన్మించిన నయనా ఝవేరీకి మణిపురి నృత్యమంటే కేవలం కళ కాదు. అదొక ఆధ్యాత్మిక సాధన. గురువు బిపిన్ సింగ్ దగ్గర శిక్షణ పొందిన ఆమె. తన ముగ్గురు సోదరీమణులతో కలిసి ఝవేరీ సిస్టర్స్ డాన్స్ కంపెనీని స్థాపించారు. సంప్రదాయ మణిపురి నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఇంఫాల్‌లోని గోవిందజీ ఆలయం నుంచి న్యూయార్క్‌లోని లింకన్ సెంటర్ దాకా తమ ప్రదర్శనలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఓ ట్రంకు పెట్టెలో దాగిన చరిత్ర!
నయనా మరణం తర్వాత కూడా ఆమె నృత్య వారసత్వాన్ని దర్షనా ఝవేరీ ఎంతో జాగ్రత్తగా కాపాడారు. ముంబై నుంచి గోవాకు చేరిన ఓ ట్రంకు పెట్టెలో పాత ఉత్తరాలు, డైరీలు, ఫొటోలు, ప్రదర్శనల పోస్టర్లు, పర్యటనల వివరాలు భద్రంగా ఉన్నాయి. ఇవే ఝవేరీ సోదరీమణుల చరిత్రకు ఆధారాలుగా నిలిచాయి.
అయితే కాలక్రమంలో కొన్ని పత్రాలు పాడయ్యాయి. మరికొన్ని కనిపించకుండా పోయాయి. ఈ చరిత్రను కాపాడాలన్న ప్రయత్నంలో భాగంగానే ‘ఝవేరీ సిస్టర్స్ ఆర్కైవ్’ రూపుదిద్దుకుంది.
జ్ఞాపకాలే సజీవ ఆర్కైవ్
86 ఏళ్ల వయసులోనూ దర్షనా ఝవేరీ తన జ్ఞాపకాలతో నృత్య వారసత్వాన్ని కాపాడుతున్నారు. గురువు బిపిన్ సింగ్ నేర్పిన కొరియోగ్రఫీ, నృత్యంలోని హావభావాలు, అభినయం ఆమె జ్ఞాపకాల్లోనే ఉన్నాయి. ఆమె మేనకోడలు అంగనా ఝవేరీ మాటల్లో చెప్పాలంటే.. గురువు నేర్పిన ఎన్నో నృత్య రూపాలు దర్షనా జ్ఞాపకాల్లో సజీవంగా ఉన్నాయి.
ఇక్కడే ఓ ముఖ్యమైన విషయం కనిపిస్తుంది. చరిత్ర అంటే పాత కాగితాలు, ఫొటోలు మాత్రమే కాదు. మనుషుల జ్ఞాపకాలు, అనుభవాలు, కళా ప్రదర్శనలు కూడా చరిత్రను కాపాడతాయి.
ఠాగూర్ చూపిన బాట
మణిపురి నృత్యానికి దేశవ్యాప్తంగా గుర్తింపు రావడంలో రవీంద్రనాథ్ ఠాగూర్ పాత్ర కూడా కీలకం. 1919లోనే శాంతినికేతన్‌లోని విశ్వభారతిలో మణిపురి నృత్యానికి చోటు కల్పించారు. అప్పటి సామాజిక పరిస్థితుల్లో మహిళలు నృత్యాన్ని వృత్తిగా ఎంచుకోవడం అంత సులభం కాదు. అలాంటి సమయంలో ఝవేరీ సోదరీమణులు తమ కళతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. భక్తి, సంప్రదాయం, ఆధునికతను కలిపి తమదైన ముద్ర వేశారు.
లాస్యలో కనిపించే నయనా జీవితం
ఈ ప్రదర్శనకు ‘లాస్య’ అనే పేరు పెట్టడం వెనుక ప్రత్యేకమైన భావం ఉంది. లాస్య అంటే సున్నితత్వం, మృదుత్వం, సౌందర్యం. అయితే ఆ మృదుత్వం వెనుక కఠినమైన సాధన, క్రమశిక్షణ కూడా ఉంటాయి. రాధ, గోపికల భక్తిని, కృష్ణుడిపై ప్రేమను వ్యక్తం చేసే ఈ నృత్య భావన నయనా జీవితంలోనూ కనిపిస్తుంది.
వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత
ఝవేరీ సోదరీమణుల కళా ప్రయాణానికి తగిన స్థాయిలో సంస్థాగత గుర్తింపు, భద్రత లభించకపోవడం బాధాకరం. వాళ్ల జీవితాలకు సంబంధించిన ఎన్నో ఆధారాలు ఇప్పటికీ పెట్టెల్లో, అల్మారాల్లోనే ఉండిపోయాయి. వాటిని సేకరించి భౌతికంగా, డిజిటల్ రూపంలో భద్రపరచడం ఇప్పుడు ఎంతో అవసరం. కళ అనేది కేవలం వేదిక మీద ప్రదర్శన కాదు. అది ఒక జీవన విధానం. జ్ఞాపకాల్లో, సాధనలో, తరతరాలకు అందించే కదలికల్లో బతికే వారసత్వం. కాగితాలు చెరిగిపోవచ్చు. ఫొటోలు మసకబారొచ్చు. కానీ కళను మనసులో నిలుపుకున్న వాళ్లున్నంతకాలం ఆ చరిత్ర బతికే ఉంటుంది.
పెట్టె దాగి ఉన్న చరిత్ర ప్రస్తుతం మనతో లేదు.. కానీ సజీవమైనది. సాధారణంగా ఏ చరిత్ర అయినా.. తాను వదిలేసిన, మర్చిపోయిన విషయాల చుట్టూనే తిరుగుతుంది.