సంబంధం చెడితే రేప్​గా పరిగణించలేం

విఫలమైన ప్రేమ సంబంధాల నేపథ్యంలో అత్యాచారం, మోసం కేసులు పెట్టే ధోరణిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Supreme Court consensual relationship judgment
పరస్పర అంగీకారంతో సాగిన సంబంధం విఫలమైందన్న కారణంతో అత్యాచారం కేసు నమోదు చేయలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
Published on: 

న్యూఢిల్లీ: సంబంధాలు బాగున్నప్పుడు పరస్పర అంగీకారంతో జరిపిన శృంగారం.. ఆ తర్వాత ఆ బంధం చెడిపోయిందన్న కారణంతో లైంగిక దాడిగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విఫలమైన ప్రేమ, వైవాహిక సంబంధాల నేపథ్యంలో క్రిమినల్‌ కేసులు పెట్టే ధోరణి పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. కేరళం రాష్ట్రానికి చెందిన సంతోష్‌ కుమార్‌ అనే వ్యక్తిపై ఉన్న లైంగిక దాడి, మోసం అభియోగాలపై కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఆర్​ మహదేవన్‌ ధర్మాసనం శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది. అత్యాచారం, లైంగిక దోపిడీ కేసులను బలవంతం చేయడం లేదా సమ్మతి లేకపోవడం, మోసం చేయడం వంటి అంశాలకే పరిమితం చేయాలని ధర్మాసనం సూచించింది. ‘గతంలో తీసుకున్న నిర్ణయం నచ్చక పరస్పర అంగీకారంతో సాగిన సంబంధాన్ని నేరంగా మార్చి, నిందితుడి స్వేచ్ఛను, ప్రతిష్ఠను దెబ్బతీయడం సరికాదు. ఒక దశలో పరస్పర అంగీకారంతో సంబంధంలో ఉన్నంత మాత్రాన.. తర్వాత అత్యాచారం కేసు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో ఆ బంధం నుంచి పురుషుడు బయటకు రాకూడదా? సంబంధం నుంచి వైదొలగడాన్ని మోసం లేదా వంచనగా పరిగణించడం కుదరదు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.

కేసు నేపథ్యం ఇదీ..

మొదటి వివాహం కొనసాగుతుండగానే తనను పెళ్లి చేసుకుని, తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని కేరళకు సంతోష్​కుమార్​
ఎన్​పీ అనే వ్యక్తిపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు గతంలో జరిగిన వివాహాన్ని దాచిపెట్టి, నిందితుడు తనను రెండో పెళ్లి చేసుకున్నాడని ఆమె ఆరోపించింది. ఈ క్రమంలో అతను అత్యాచారం, మోసం, నమ్మకద్రోహానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. కాగా, గతంలో మరో వ్యక్తితో విడాకులు పొందిన ఆమె..  1996 నుంచి 2003 వరకు మైసూరులో తనతో కలిసి జీవించిందని, తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని సంతోష్​కుమార్​ కేరళం హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడ ఊరట లభించకపోవడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం ధర్మాసనం ఆయనకు ఉపశమనం కల్పించింది.