‘భరించలేకపోతే విమాన ప్రయాణం ఎందుకు?’.. టికెట్ల ధరల పిటిషన్‌పై సుప్రీంకోర్టు

విమాన ఛార్జీలు 700 శాతం పెరిగాయన్న పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు, ప్రయాణికుల రక్షణకు నిబంధనలు రూపొందించాలని కేంద్రాన్ని కోరింది.
Supreme Court hearing on rising airfares in India
సుప్రీంకోర్టు
Published on: 

న్యూఢిల్లీ : విమాన టికెట్ల ధరలు విపరీతంగా పెరిగినట్లు దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ‘‘భరించలేనప్పుడు విమాన ప్రయాణం చేయడం ఎందుకు’’ అని పిటిషనర్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది. ‘‘ప్రయాణ ఛార్జీలు 700 శాతం పెరిగాయి. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది’’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దేశంలో పౌర విమానయాన రంగ నియంత్రణకు పారదర్శకమైన విధానం అవసరమని మరో పిటిషన్ కూడా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం విచారణలో ఉంది.

పండగ సమయాల్లో ధరల దోపిడి

నియంత్రణ చట్టం అమలు ‘భారతీయ వాయుయాన్ అధినియం 2024’ కింద కొత్త నిబంధనలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ నిబంధనల వివరాలను నవంబరు16వ తేదీ నాటికి కోర్టు ముందు ఉంచాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. పండగ సమయాల్లో విమానయాన సంస్థలు ధరలను విపరీతంగా పెంచడం దోపిడీ కింద లెక్కగట్టాలని కోర్టు గతంలోనే అభిప్రాయపడింది. ప్రయాణికుల రక్షణ కోసం పటిష్టమైన నిబంధనలు రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ప్రస్తుత విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.